అక్రమ మైనింగ్ చేయవద్దని తాము ఆదేశించినా చేస్తున్నారని ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో అసలేం జరుగుతోంది ? అని మండిపడింది. నిజానికి ఈ విషయం హైకోర్టుకు బాగా తెలుసు. హైకోర్టు తీర్పులు ఏ మాత్రం అమలు కావడం లేదనేది బహిరంగ రహస్యం. న్యాయవ్యవస్థను ఏపీ ప్రభుత్వం ఎప్పుడో లైట్ తీసుకోవడం ప్రారంభించింది. తీర్పుల ఉల్లంఘన తమ ప్రాథమిక హక్కు ఉన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఒకటా.. రెండా… అసలు ఏ విషయంలో న్యాయస్థానాల తీర్పును ఏపీ ప్రభుత్వం గౌరవించిందో లెక్క తీస్తే ఒక్కటంటే ఒక్కటీ ఉండదు.
రుషికొండ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలే పట్టించుకోరు !
కింది కోర్టులు.. హైకోర్టు ఆదేశాల గురించి తర్వాత చెప్పుకుందాం.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఏపీ సర్కార్ పట్టించుకోదు. దానికి కళ్లెదుట కనిపించే ఉదాహరణ రుషికొండ. అయినా అధికారులు.. ఏవో మభ్య పెట్టి.. పనులు జరగడం లేదని… చెబుతూ ఉంటారు. కానీ అన్నీ జరిగిపోతూంటాయి. సుప్రీంకోర్టుకే అబద్దాలు చెప్పి కోర్టు ధిక్కరణకు పాల్పడటానికి ఏ మాత్రం వెనుకడని ఏపీ సర్కార్ .. ఇక హైకోర్టు.. కింది కోర్టులను పరిగణనలోకి తీసుకుంటుందా ?
హైకోర్టు ఆదేశాలు ఏ విషయంలో అమలయ్యాయి ?
హైకోర్టు ఎన్నో ఆదేశాలిస్తుంది. కానీ ఒక్కటీ అమలు చేయరు. అందుకే వేల కొద్దీ కోర్టు ధిక్కరణకేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు తీర్పు ఉల్లంఘిస్తే ఏమవుతుంది.. ధిక్కరణేగా.. అంతా చేసేసి.. సారీ చెబితే సరిపోతుందన్న ధీమా ప్రభుత్వంలో ఉంది. అది ప్రభుత్వ పరమైన విషయాల్లోనే కాదు.. ఇలా అక్రమ మైనింగ్ సహా అన్ని అంశాల్లోనూ ఉంది. తమ ఆదేశాలు అమలు చేయడం హైకోర్టు ఎన్నో సార్లు మండి పడింది. చివరికి రూల్ ఆఫ్ లా గురించీ మండిపడింది. ఈ పరిస్థితి చూసి గతంలో జస్టిస్ రాకేష్ కుమార్ ఏపీలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిదో లేదో తేల్చాలని రూలింగ్ ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లి.. స్టే తెచ్చుకోగలిగారు.
అదనంగా న్యాయవ్యవస్థపై ఎదురుదాడి కూడా !
సాధారణంగా న్యాయస్థానాలు ఫైనల్. అందుకే నేరస్తులందరూ.. కోర్టులకు భయపడతారు. కానీ ఏపీలో మాత్రం దానికి భిన్నం . ఏ స్థాయి న్యాయస్థానాలయినా లెక్కలేదు. పైగా వాటిపైనే ఎదురుదాడి చేస్తారు. ఉద్దేశాలు అంటగడతారు. తప్పుడు కేసులు కూడా పెట్టగలరు. తప్పుడుకేసులు పెట్టి న్యాయమూర్తుల్నీ వేధించగలరు. ఇలాంటి ఓ భిన్నమైన పరిపాలన ఏపీలో జరుగుతోంది. అక్కడ రాజ్యాంగం ప్రకారం ఏదీ నడవడం లేదు. అందుకే హైకోర్టు తరచూ ఏపీలో ఏం జరుగుతోందని.. మథనపడుతోంది. ఇలా జరగడానికి కారణం న్యాయవ్యవస్థ .. కొరడా ఝుళిపించకపోవడమే. దాన్నే అలుసుగా తీసుకుని న్యాయవ్యవస్థను బలహీనం చేసేందుకు పాలకులు ఉపయోగించుకుంటున్నారు.