ఏపీ ప్రభుత్వం కొత్తగా ఆహార కమిషన్ చైర్మన్ పదవిని ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన విజయ్ ప్రతాప్ రెడ్డిని ఈ పదవికి నియమించారు. ఇటీవలి కాలంలో ఏ పదవి ప్రకటించినా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉంటున్నారు.ఈ కారణంగా విజయ్ ప్రతాప్ రెడ్డి పేరును ప్రకటించినా ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. అయితే ఇతర ప్రాంతాలకు కూడా అవకాశం దక్కడం లేదు. పూర్తి స్థాయిలో కడప రెడ్డి నేతలకు మాత్రమే ఇలా నామినేటెడ్ పోస్టులు దక్కుతున్నాయి.
ప్రెస్ అకాడామీ చైర్మన్ దగ్గర నుంచి పదో తరగతి చదివి ఆయిల్ వ్యాపారం చేసుకునే వారికి వ్యవసాయ సలహాదారు పదవి ఇవ్వడం వరకూ లెక్క తీస్తే … కడపలో పదవులు పొందని వైసీపీ రెడ్డి నేతలు దురదృష్టవంతులనే అనుకోవాలి. ఎలాంటి అవకాశం వచ్చినా ముందుగా రెడ్డి నేతలకు పదవులు ఇస్తున్నారు.చివరికి ఏపీపీ ఎస్సీలో ఇటీవల ఓ సభ్యుడ్ని నియమించారు. ఆయన కడప జిల్లాలో మెడికల్ షాపు నిర్వహించుకునే వైసీపీ చోటా రెడ్డి నేత. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే.. బయటకు తెలియనివి కూడా కోకొల్లలు.
రాష్ట్రంలో ఇప్పటి వరకూపనికి రాని.. ఆదాయం లేని.., కనీసం చెప్పుకునే స్థాయి లేనిపదవులు వందల కొద్ది ఇతర నేతలకు ఇచ్చినట్లుగా చెప్పుకున్నా.. అసలు పదవుల్ని తమ వారికే కట్టబెడుతున్నారు. అదీ కూడా తమ ప్రాంతం వారికే కట్టబెడుతున్నారు. పాలకులు ఆలోచనలు ఎంత చిన్నవో ఈ నియామకాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. కానీ వారు మాత్రం బయటకు తాము సామాజిక న్యాయం చేస్తున్నామని ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రచారం చేసుకుంటూ ఉంటారు.