ఏపీ హైకోర్టు ఇచ్చిన అనేకానేక తీర్పుల మీద అయిననూ పోయి రావలె అన్నట్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన ఏపీ సర్కార్.. ఇప్పుడు విచారణకు వెనక్కు తగ్గుతోంది. విచారణలకు సమయం కావాలంటూ న్యాయవాదుల ద్వారా అభ్యర్థిస్తోంది. ఈ ఒక్కరోజే.. అలాంటి నాలుగు కేసులు మూడు వారాలకు వాయిదా పడ్డాయి. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని ఏపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. అసలు నేరం జరిగిందో లేదో తెలియకుండా దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ సర్కార్ ఈ స్టే నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
దీనిపై విచారణ సుప్రీంకోర్టు ముందుకు వచ్చే సరికి.. విచారణకు మూడు వారాల సమయం కావాలని ఏపీ సర్కార్ కోరింది. అలాగే.. అమరావతి భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో ఏపీ సర్కార్ సవాల్ చేసింది. ఆ కేసులోనూ.. విచారణకు 3 వారాల సమయం కోరింది ఏపీ ప్రభుత్వం. అలాగే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి.. ఆస్తుల కొనుగోలు అంశంపై పైనా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఇందులోనూ మూడు వారాల సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అన్ని కేసుల్లోనూ అలాగే కోరడం.. న్యాయమూర్తి అంగీకరించడం జరిగిపోయాయి.
దీంతో ఎంతో ఆవేశంగా సుప్రీంకోర్టుకు వచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఎందుకు వాదనలు వినిపించడానికి వెనుకడుగు వేస్తోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో వైపు.. సీజేఐకి జగన్ రాసిన లేఖను బహిర్గతం చేయడంపై.. చర్యలు తీసుకోవాలని గతంలో న్యాయవాది సునీల్కుమార్సింగ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై వివరణ ఇవ్వడానికి సుప్రీంకోర్టును 3 వారాల సమయం కోరారు. దీనికీ సుప్రీంకోర్టు అంగీకరించింది. కారణం ఏమిటో కానీ.. వాయిదాల పద్దతిని ఏపీ సర్కార్ ఎంచుకుంటోంది.