జీతాలు ఇవ్వడానికి తంటాలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రెండు వేల కోట్ల రుణాలను సేకరించింది. ప్రతీ మంగళవారం ఆర్బీఐ వేసే బాండ్ల వేలం ద్వారా రెండు వేల కోట్ల రుణం సమీకరించుకుంది. ఈ నిధులు బుధవారం రాష్ట్ర అకౌంట్లోకి జమ అవుతాయి. ఆ నిధులను ఉద్యోగుల జీతాలు.. పెన్షనర్ల పెన్షన్లకు చెల్లింపులు చేసే అవకాశం ఉంది. అనుకున్న స్థాయిలో బ్యాంకుల నుంచి అప్పులు పుట్టుకపోవడంతో ఈ నెల జీతాలను సజావుగా పంపిణీ చేయలేకపోయారు.
ఉన్న నిధులతో ఒకటో తేదీన సెక్రటేరియట్లో పని చేసేవారికి పంపిణీ చేశారు. జిల్లాల్లో పని చేసేవారికి.. టీచర్లకు ఇంత వరకూ జీతాలు అందలేదు.
నిధుల కొరత తీవ్రంగా ఉండటం.. అప్పులు చేయడానికి కూడా కేంద్రం కొర్రీలు పెడుతోంది.అప్పుల పరిమితిని భారీగా తగ్గించింది. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదే పనిగా ఢిల్లీలో కలవాల్సిన వాళ్లందర్నీ కలిసి ఈ వారం రెండు వేల కోట్ల అప్పునకు అనుమతి తీసుకున్నారు. దీంతో ఈ నెల జీతాల గండం గట్టెక్కినట్లయింది. రేపు ఆర్బీఐ నుంచి నిధులు రాష్ట్ర ఖాతాకు జమ అయిన తర్వాత మిగిలిన వారికి జీతాలు.. పెన్షన్లు చెల్లింపులు చేస్తారు.
కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే.. అమరావతి రైతులకు కౌలు.. భూమిలేని పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. లోన్ రాగానే.. వీటికి సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం వైస్ అండ్ మీన్స్.. ఓవర్ డ్రాఫ్ట్ వంటి సౌకర్యాల్ని మ్యాగ్జిమం వాడుకుంటోంది. ఈ క్రమంలో ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటున్న అభిప్రాయం ఏపీ అధికారవర్గాల్లో ఏర్పడుతోంది.