ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేసింది. ఇప్పటికే కొద్దిగా అయినా మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం తాజాగా సొంత బ్రాండ్లను త్యాగం చేసి… పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ కంపెనీలకు ఇండెంట్ పెట్టడంతో కొంత సరుకు డిస్టిలరీలకు చేరింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఆ మద్యం బ్రాండ్లు దుకాణాల్లో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ సర్కార్ వచ్చిన తర్వాత మద్యం విధానం సమూలంగా మారిపోయింది. ప్రభుత్వ అమ్మకాలు ప్రారంభమయ్యాయి… అంతే కాదు ఓన్లీ ఫర్ ఆంధ్రా బ్రాండ్స్ మాత్రమే అమ్మడం ప్రారంభించారు.
ఆ మద్యం ఇతర రాష్ట్రాల్లో అమ్మడానికి పర్మిషన్ ఉండదు. ఏపీలో మాత్రమే అమ్ముతారు. అత్యంత నాసిరకం మందు మాత్రమే కాదు.. పాపులర్ బ్రాండ్లకు నకిలీలుగా ప్యాకింగ్ కూడా ఉంటుంది. ఇలా ఏపీ మందు బాబులు రెండున్నరేళ్లుగా దారుణంగా దోపిడీకి గురవుతున్నారు. అదేమంటే తాగుడు తగ్గించడానికేనని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. ఇప్పుడు తాగుడును పెంచాలనుకుంటుందేమో కానీ పాత పద్దతిలోనే బ్రాండ్లను అమ్మడానికి సిద్ధమయింది.
అయితే ప్రభుత్వం తమ సొంత బ్రాండ్లను పూర్తిగా త్యాగం చేస్తుందా లేకపోతే ఇప్పటికే వాటికి అలవాటు పడ్డారు కాబట్టి… వాటినే మందు బాబులు తాగుతారా అనేది వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా చూస్తే రెండున్నరేళ్ల తర్వాత ఏపీ మందు బాబులు… తమ బ్రాండేది అనుకుంటూ మళ్లీ పార్టీలు చేసుకునే పరిస్థితి మాత్రం వచ్చింది.