చిత్రసీమకు, సినీ అభిమానులకు ఇది శుభవార్తే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్కి అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తూ.. కీలకమైన నిర్ణయం తీసుకుంది. 50 శాతం సిట్టింగ్ కెపాసిటీతో.. థియేటర్లు తెరచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. జులై 8 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు తెరచుకోవచ్చని ప్రభుత్వం చెప్పేసింది. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవొచ్చు. ఏపీలో మాత్రం 50 శాతమే. కాబట్టి.. చిన్న సినిమాల విడుదలకు మార్గం సుగమం అయినట్టే. ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి ఏపీ, తెలంగాణలలో థియేటర్లు మూతబడ్డాయి. అప్పటి నుంచీ కొత్త సినిమాలు విడుదలకు నోచుకోలేకపోయాయి. చాలా చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణలలో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు వచ్చాయి కాబట్టి, చిన్న సినిమాలు విడుదలకు రెడీ కావొచ్చు. ఏపీలోనూ 100 శాతం సిట్టింగ్ కి అనుమతి ఇస్తే.. పెద్ద సినిమాలూ వస్తాయి.
* టికెట్ రేట్లు ఎలా?
వకీల్ సాబ్ కి ముందు.. ఏపీలో టికెట్ రేట్లు తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది పరోక్షంగా వకీల్ సాబ్ వసూళ్లని దెబ్బకొట్టడానికే అని.. అప్పట్లో పవన్ అభిమానులు మండి పడ్డారు. అయితే ఇప్పుడూ అవే రేట్లు కొనసాగితే పెద్ద సినిమాలకు నష్టమే. ఏపీలోటికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. టికెట్ రేట్లపై ఓ నిర్ణయం ప్రకటించేవరకూ పెద్ద సినిమాలేవీ బయటకు రావు. కాకపోతే మీడియం, చిన్న సినిమాలకు మాత్రం ఇదో మంచి అవకాశం. ఆగస్టు నుంచి.. టాలీవుడ్ లో కొత్త సినిమాల హవా మొదలు కానుంది. ఈలోగా జగన్ ప్రభుత్వం టికెట్ రేట్లపై ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుందని టాలీవుడ్ కోరుకుంటోంది.