ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతో జగన్ సర్కార్ పరాచికాలు ఓ రేంజ్లో ఉన్నాయి. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీని చూపిస్తూ ఉద్యోగులు రోడ్డెక్కుతూంటే.. తాజాగా జీపీఎస్ అనే కొత్త స్కీమ్‌ను ఉద్యోగులకు చూపించడం ప్రారంభించింది ప్రభుత్వం. సీపీఎస్ ఉద్యోగులు ఎవరూ లేని ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి జీపీఎస్‌పై ప్రజెంటేషన్ ఇచ్చింది. జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్‌ను అంగీకరింపచేసేలా ఉద్యోగులతో మాట్లాడేందుకు ఐదుగురితో ఓ కమిటీ కూడా వేశారు. ఇందులో సజ్జల కూడా ఉన్నారు.
గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌లో ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచి కొంత కట్ చేసుకుని .. రిటైరైన తర్వాత పెన్షన్‌గా ఇస్తారట. సీపీఎస్లోనూ అంతే కాకపోతే.. సీపీఎస్‌లో కట్ చేసుకునే మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. స్కాట్ మార్కెట్ పనితీరును బట్టి పెన్షన్ వస్తుంది. ఇక్కడ మాత్రం కట్ చేసుకున్న దాన్ని బట్టి ఇస్తారట. అంటే.. అటు సీపీఎస్‌కు.. ఇటు జీపీఎస్‌కు ప్రభుత్వం చందా చెల్లించాల్సిందే. ఇది ఉద్యోగుల్ని మరింత ఆగ్రహానికి గురి చేసేలా ఉంది.
సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. పాత పెన్షన్ విధానం కావాలంటున్నాయి. కానీ అది సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఇచ్చిన హామీని అమలు చేయమంటే.. కొత్త కొత్త స్కీముల కబుర్లు చెబుతూండటంతో సీబీఎస్ ఉద్యోగులకు మండిపోతోంది. మంగళవారం నుంచి ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతోంది. అయితే ఉద్యోగులు ఒప్పుకన్నా.. ఒప్పుకోకపోయినా జీపీఎస్ అమలు చేసి.. సీపీఎస్ కు ముగింపు ఇవ్వాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.