ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. వారంలో సీపీఎస్ రద్దు అన్న జగన్ హామీని తీసి పజేసింది. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో పాత పింఛన్ విధానం అమలు సాధ్యం కాదని మంత్రుల కమిటీ తెగేసి చెప్పేసింది. జీపీఎస్ విధానం అమలుకు ఉద్యోగుల సహకారం కావాలని సూచించారు. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు రావని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఉద్యోగులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అవేమీ ప్రభుత్వం డబ్బులు కాదని.. ఉద్యోగుల డబ్బులనీ.. ఉద్యోగ సంఘ నేతలు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.
నిజానికి సీపీఎస్ రద్దు అంశంపై ఏపీ ప్రభుత్వం పూర్తిగా వెనుకడుగు వేసింది. జగన్ తెలియక హామీ ఇచ్చారని సజ్జల ఇంతకు ముందే ప్రకటించారు. ఇప్పుడు దాన్ని అధికారికంగా ఉద్యోగులకు వివరించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తామని చెప్పినప్పుడు… సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు. చివరికి చేతులెత్తేశారు. దీనిపై సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోతే తక్షణం గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే సీపీఎస్ రద్దు అంశం అసాధ్యమేమీ కాదనీ ఇటీవల కొన్ని రాష్ట్రాలు నిరూపిస్తున్నాయి. రాజస్తాన్ ఉద్యోగులు ఆందోళనలు చేయకపోయినా సీపీఎస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వం మోసం చేసిందని రగిలిపోతున్నారు.