ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆర్థిక సంవత్సర ముగింపు ఆఫర్లు ఓ రేంజ్లో ఉన్నాయి. వాటికి జనం బేంబెలెత్తుతున్నారు. ఇవేం ఆఫర్లురా బాబూ అని కిందా మీదా పడుతున్నారు. అలాంటి ఆఫర్లలో కొన్ని చెత్త పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త వేయడం, ఆస్తి పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోవడం, నీటి తీరువా కట్టకపోతే రైతుల పొలాల్లో తిష్ట వేయడం, లైసెన్స్ ఫీజు డబుల్ కట్టకపోతే హోటళ్ల సంగతి చూడటం. .. ఇలాంటివన్నమాట. ఇప్పుడు అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ పన్నుల మీదే దృష్టి కేంద్రీకరించారు. ఎంతగా అంటే… కేవలం ఆస్తిపన్ను, చెత్త పన్ను రూపంలోనే రూ. వెయ్యి కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇతర పన్నుల టార్గెట్లు ఎంత ఉన్నాయో ప్రభుత్వానికి తెలియాలి.
చెత్త పన్ను కట్టకపోతే ఇళ్లు, దుకాణాల ముందు చెత్త పోయడం ఖాయమని ముందుగా ఓ చోట చేసి చూపించి సందేశం పంపుతున్నారు. దానికి విస్తృత ప్రచారం వచ్చేలా చూసుకుంటున్నారు. దాన్ని చూపించి చెత్తపోయాలా పన్ను కడతారా అన్నట్లుగా వసూళ్లకు సిద్ధమవుతున్నారు. ఇక ఆస్తి పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోతామని ఓ ఫ్లెక్సీ వేయించి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వెంటనే ఆస్తి పన్ను కట్టాలంటూ.. ఇంటి తలుపులు తట్టడం ప్రారంభించారు. ఇలా అన్ని చోట్లా అంతే.. పన్నుల వసూలుకు ప్రత్యేక బృందాలతో ఏపీ ప్రజలకు ఆర్థిక సంవత్సరం ముగింపులో కొత్త లెక్కలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి రూ. వేల కోట్లలో చెత్త పన్నులు, ఆస్తి పన్నులు వసూలు చేయాలనుకోవడం.. అదీ కూడా వారిని అవమానించి.. పరువు తీస్తామని బెదిరించి కూడా వసూలు చేయడం కొత్త చరిత్రగా చెప్పుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి పనుల వల్ల ఇప్పటికైతే ఆదాయం వస్తుంది కానీ.. ప్రజలు మాత్రం మరో రకంగా అనుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తక పడకపోతే మొదటికే మోసం వస్తుంది.