ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఏపీ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. అప్పటి వరకూ ధర్నాలు, ఆందోళనలు, చలో విజయవాడ, సహాయనిరాకరణ వంటి రూపాల్లో ఉద్యమాలు చేస్తారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ఉద్యోగ సంఘాల్లో వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా ఉద్యోగుల ఆవేశం చూసి.. పాల్గొనక తప్పడం లేదు.
ఇప్పటికే ఉపాధ్యాయులు చేసిన ఆందోలన హాట్ టాపిక్ అయింది. ఇక అందరు ఉద్యోగులు రోడ్డెక్కితే పరిస్థితి వేరుగా ఉంటుంది. అయితే ప్రభుత్వం చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరుతోంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి.. సజ్జల నేతృత్వంలో ఓ సబ్ కమిటీని వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కమిటీతో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను పిలుస్తారు.
అయితే ఉద్యోగ సంఘాలు ముందుకు జీవోలను వెనక్కి తీసుకున్న తర్వాతనే చర్చలకు వస్తామని ఇప్పటికే ప్రకటించాయి. అదీ కూడా ముఖ్యమమంత్రితోనే చర్చలకు వస్తామని.. అధికారులతో ఇక చర్చించే ప్రశ్నే లేదని అంటున్నారు. మొత్తంగా ప్రభుత్వం ఉద్యోగులను కూల్ చేసేందుకు తాము చేయగలిగిన ప్రయత్నం తాము చేస్తున్నామన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.