కరోనా సెకండ్ వేవ్ పెద్దగా లేనప్పుడు.. బడ్జెట్ పెట్టి ఆమోదించుకోవడానికి బద్దకించిన ఏపీ సర్కార్కు ఇప్పుడు పరిస్థితి పీకల మీదకు వచ్చేసింది. రాను రాను ఆంధ్రలో కరోనా పరిస్థితి తీవ్రంగా మారుతోంది. మరో వైపు.. మూడు నెలల కోసం ఆమోదించుకున్న బడ్జెట్ గడువు కూడా ముగుస్తోంది. ఎలాగోలా
నెలాఖరులోనో..లేకపోతే వచ్చే నెల మొదట్లోనే.. బడ్జెట్ సమావేశాలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో… షార్ట్ కట్ ఆలోచించింది. ఒక్క రోజులో సమావేశాలు పెట్టి మెరుపు వేగంతో అన్ని వ్యవహారాలు పూర్తి చేయాలనుకుంటోంది.
సాధారణంగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం సమయంలో ఉభయసభల సమావేశాలు పెట్టి..గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదాపడుతుంది. మళ్లీ సభ్యులెవరైనా చనిపోతే వారికి సంతాపం చెప్పి వాయిదా పడుతుంది. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ ఉంటుంది. ఆ తర్వాత ఆమోదించుకుంటారు. ఇలా.. చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకే ఎక్కడైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయి. ఈ సారి ఇప్పటికే ఓ సారి ఆర్డినెన్స్ జారీ చేసినందుకున ఇక బడ్జెట్ సమావేశాలు పెట్టి ఆమోదించుకోక తప్పని పరిస్థితి.
అందుకే.. ఒక్క రోజలోనే అన్నీ చేసేసేలా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అంటే గవర్నర్ ప్రసంగం.. సంతాప తీర్మానాలు.. బడ్జెట్ ప్రసంగం.. ఆమోదం.. వాయిదా .. అలా అన్నీ ఒక్క రోజలోనే చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే స్పీకర్ తమ్మినేనికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కు తగ్గిపోయింది. అందుకే ఓ పది రోజుల గ్యాప్ తీసుకుని ఇరవయ్యో తేదీన సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఒక్క రోజు బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తే అదో రికార్డ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.