విజయవాడలో కదం తొక్కిన ఉద్యోగుల ఆగ్రహం, ఆవేశం ఎలాంటి ప్రభుత్వానికైనా అభద్రతా భావం సృష్టిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్కు కాదు. ఉద్యోగుల ఉద్యమం సూపర్ సక్సెస్ అయిందని అన్ని స్థాయిల ఉద్యోగులూ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారని తెలిసిన తర్వాత ప్రభుత్వం మరింత నింపాదిగా మారిపోయింది. ఎప్పుడూ చెప్పే మాటలే చెప్పింది. సీఎం జగన్తో మధ్యాహ్నం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశం అయ్యారు. తర్వాత వైవీ సుబ్బారెడ్డి మినహా మిగిలిన ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు మీడియాతో మాట్లాడారు.
సజ్జల, సీఎస్ సమీర్ శర్మ.. చెప్పిందే మార్చి చెప్పారు. ఉద్యోగులకు సమస్యను పరిష్కరించుకోవాలని లేనట్లుగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చర్చలకు రావాలని ప్రతి రోజూ పిలుస్తున్నామని కానీ వారు రావడం లేదన్నారు. చర్చలతో తప్ప సమస్య ఎలా పరిష్కారం అవుతుందని ప్రశ్నించారు. ఉద్యోగులకు చాలా చేశామని.. సమ్మెకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సజ్జల మరింత బెదిరింపుతో మాట్లాడటం.. ఉద్యోగులే అతి చేస్తున్నారన్నట్లుగా చెప్పడంతో ప్రభుత్వ విధానం స్పష్టమమైంది.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎస్ సమీర్ శర్మ ఉద్యోగుల విషయంలో మరింత నిర్లక్ష్యంగా మాట్లాడారు. పీఆర్సీ లేటయిందని .. ఐఆర్ రూపంలో వడ్డీ లేని రుణాన్ని ఉద్యోగులకు ఇచ్చామని ఆయన తేల్చేశారు. దాన్ని రికవరీ చేయాల్సిందేనని అయితే ఫిట్మెంట్తో కవర్ చేశామన్నారు. సమ్మె చేస్తే ఏమొస్తుందని.. సమ్మె నోటీసును వెంటనే ఉపసంహరించుకుని చర్చలకు రావాలన్నారు. ఎక్కడ జీతం తగ్గిందో చెప్పాలని సూచించారు. పే స్లిప్లను ఆయన ప్రదర్శించారు. తెలంగాణలా తాము కూడా అప్పట్లోనే డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లు మిగిలేదని సెటైర్ వేశారు.
మొత్తంగా ఉద్యోగులు ఉద్యమంలో మరింత ముందుకెళ్తామని హెచ్చరిస్తూంటే.. ప్రభుత్వం మాత్రం వారిపై చెప్పిన మాటలే చెబుతూ సెటైర్లు వేస్తోంది. దీంతో సమస్య జఠిలం అవుతోంది. ఇది తీరానికి చేరుతుందో అంచనా వేయడం కష్టమన్నట్లుగా పరిస్థితి మారింది.