ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అంటూ ప్రభుత్వం కొత్త పీఆర్సీ జీవోలను ఈ సారి అర్థరాత్రి కాకుండా ఆదివారం విడుదల చేసింది. ఈ జీవోల విషయంలో ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం ఉందో లేదో కానీ అత్యంత కీలకమైన విషయం మాత్రం ఇందులో లేదు. అదే రికవరీ. మధ్యంతర భృతిని రికవరీ చేయబోమని జీవో మాత్రం ఇంకా విడుదల కాలేదు. గతంలో జారీ చేసిన జీవోల ప్రకారం ఐఆర్ రికవరీ ఉంటుంది. ఇప్పుడు అసలు రికవరీ ఉండదనే జీవో మాత్రం రాలేదు. ఇందులో ఏదో లొసుగు ఉంటుందని ఉద్యోగులు అనుమానపడుతున్నారు.
హెచ్ఆర్ఏ విషయంలో గతంలో ఉన్న వాటిని తొలగించి తక్కువ శ్లాబులు ఖరారు చేశారు. ఉద్యోగుల ఆందోళనల తర్వాత తర్వతా కాస్త పెంచినప్పటికీ ఇంకా తగ్గుదలే ఉంది. అయితే పూర్తిగా తగ్గించడం కన్నా ఎంతో కొంత సాధించామన్న అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘ నేతలు కల్పించగలిగారు. అయితే డీఏల విషయంలో పాత బకాయిలు వస్తాయా రావా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలో ఐఆర్ రికవరీకి వాటిని సర్దుబాటు చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు రికవరీ లేదు కాబట్టి వాటిని బకాయిలుగా ఇవ్వాల్సి ఉంటుంది. చర్చల్లో రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని ప్రభుత్వం అంగీకరించింది. ఆ విషయం జీవోలో వెల్లడి కాలేదు.
ఈ పీఆర్సీలపై కొన్ని ఉద్యోగ సంఘాలు మాత్రమే సంతృప్తిగా ఉన్నాయి. ఉపాధ్యాయ , పెన్షనర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారి పోరాట కార్యాచరణ వారు ప్రకటించారు. ఈ జీవోల తర్వాత “ఆ నలుగురు” నేతల స్పందన భిన్నంగా ఉండే అవకాశం లేదు. రికవరీపై ప్రభుత్వం దోబూచులాడుతున్నా తమ వైఖరికే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగులు ఎలా స్పందిస్తారు.., వారు ఉపాధ్యాయులతో కలిసి పోరుబాట పడతారా లేదా సర్దుకుపోతారా అన్నది ముందు ముందు తెలుస్తుంది.