ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. వారం రోజుల వరకూ నిర్వహిస్తామన్న సంకేతాలను పంపింది. అయితే అది ఉత్తుత్తినే. అసలు నిర్వహించాలనుకుంటున్నది ఒక్క రోజు మాత్రమే. ఈ నెల పద్దెనిమిదో తేదీన అసెంబ్లీ సమావేశం ఉంటుంది. ఒక్క రోజు మాత్రమే నిర్వహించి వాయిదా వేస్తారు. మళ్లీ వచ్చే నెలలో వారం, పది రోజుల పాటు నిర్వహిస్తామన్న లీక్‌ను మాత్రం మీడియాకు ఇస్తోంది. 17వ తేదీన కేబినెట్ భేటీ ఉంది. ఆ రోజున ఒక్క రోజులో ఏం చేయాలో ఖరారు చేస్తారు.
ఒక్క రోజు కూడా ఎందుకు ప్రభుత్వం పెట్టాలని అనుకుంటోంది అంటే.. రాజ్యాంగం తప్పని సరి పరిస్థితి కల్పిస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఒక సారి అసెంబ్లీ తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుంది. రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ వర్షా కాల సమావేశాలను నిర్వహించలేదు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించేశారు.
ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా ఒక్కటంటే ఒక్క రోజు నిర్వహించిన ఘనత ప్రభుత్వానిది. గత మార్చిలో బడ్జెట్ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేసుకున్నారు. చివరికి మే 20వ తేదీన ఒక్కటంటే ఒక్క రోజు మాత్రమే సభను నిర్వహించి బడ్జెట్ పెట్టుకుని ఆమోదించుకుని వాయిదా వేశారు. ఆ ఒక్క రోజు సమావేశానికి టీడీపీ హాజరు కాలేదు. నవంబర్ 20వ తేదీకి ఆరు నెలలుపూర్తయిపోతుంది. అంటే ఖచ్చితంగా 20వ తేదీ కంటే ముందే అసెంబ్లీని సమావేశపర్చాలి. ఇప్పుడు ఒక్క రోజు భేటీకి టీడీపీ హాజరవుతుందో లేదో చెప్పడం కష్టమే.