టీడీపీ నేత , మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైలవరం నియోజకవర్గం పరిధిలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ.. పార్టీ నేతలతో కలిసి పరిశీలనకు వెళ్లిన ఆయనపై పోలీసులు హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వివాదాస్పదమయింది. ఆయన ఎవరిపై దాడి చేసినట్లుగా ఆధారాలు లేకపోయినా కావాలనే కేసులు పెట్టారని.. ఇదంతా రాజకీయ కుట్ర అని విమర్శలు వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఆయనను తెల్లవారుజామున కారు అద్దాలు ధ్వంసం చేసి మరీ అరెస్ట్ చేశారు. తర్వాత రోజు సాయంత్రం వరకు నందివాడ అనే మండల పోలీస్ స్టేషన్లో ఉంచి.. జైలుకు తరలించారు.
తనపై పెట్టిన కేసులు అక్రమం అని వాదిస్తూ… ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. మరో వైపు మచిలీపట్నం కోర్టులో కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. నిన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును ప్రకటించింది. దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసింది. మచిలీపట్నం కోర్టులో కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. అయితే అక్రమ కేసులు.. . రాజకీయ కుట్ర ప్రకారమే పెట్టారని దేవినేని ఉమ తరపు లాయర్ బలంగా వాదించడంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
దేవినేని ఉమను అరెస్ట్ చేయడంతో ఆ అంశానికి మరింత ఫోకస్ వచ్చింది. అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని గతంలో ఓ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయినా చర్యలు తీసుకోలేదు. రివర్స్ లో ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని వారిపై నే చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం మరింత వివాదస్పదమయింది. ప్రభుత్వం తీరుపై ఎన్నో అనుమానాలు కలగడానికి కారణం అయింది. అయితే దేవినేని ఉమను కొన్నాళ్లైనా జైల్లో పెట్టాలన్న వైసీపీ పెద్దల పట్టుదల ఈ కేసులో ఫలించిందన్న అభిప్రాయం మాత్రం వైసీపీలో వినిపిస్తోంది.