అధికారం చేతిలో ఉంటే ఇష్టారీతిన కేసులు ఎత్తేసుకోవడానికి చాన్స్ లేదని హైకోర్టు .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేరుగా సందేశం పంపింది. సీఎం జగన్‌పై సీబీఐ కేసులు కాకుండా… రాష్ట్రంలో నమోదైన ఇతర కేసులు చాలా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..అనేక మార్లు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడటం సహా.. ఇతర కేసులు ఉన్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత వాటిలో పదకొండు కేసుల్ని ఏకపక్షంగా ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హైకోర్టు అనూహ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని ప్రభుత్వానికి, కేసుల్లోని మిగతావారికి నోటీసులు జారీ చేసింది.
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసులపై హత్యాయత్నం చేసిన కేసుల దగ్గర్నుంచి .. హత్య కేసుల్లో నిందితుల వరకూ.. కొన్ని వందల కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటి కేసుల్లో పదకొండు కేసుల్లో జగన్ కూడా నిందితునిగా ఉన్నారు. కేసుల ఉపసంహరణ తర్వాత… ఫిర్యాదుదారుడి అనుమతి లేకుండానే కేసులను.. చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకున్నారని హైకోర్టుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించేందుకు హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక మేరకు సుమోటోగా విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ కేసులపై బుధవారమే విచారణ జరగనుంది.
ఏ మాత్రం అవకాశం ఉన్నా… జీవోలు జారీ చేశో.. చట్టం చేశో.. సీబీఐ కేసుల్ని కూడా జగన్ ఉపసంహరించుకునేవారని ఇప్పటికీ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతూనే ఉంటాయి. అయితే అంత తేలికగా.. సీఎం పొజిషన్లో ఉన్నప్పటికీ.. కేసుల నుంచి తప్పించుకోలేరని.. తాజాగా హై కోర్టు స్పందనతో తెలిసిపోతోందని అంటున్నారు. మరీ సీరియస్ గా భారీ శిక్ష పడే కేసులు కాకపోయినా పక్కాగా ఆధారాలు ఉన్న కేసులుగా న్యాయనిపుణులు జగన్ కేసులను చెబుతూంటారు. ఇప్పుడు ఈ కేసులు ఎలాంటి మలుపు తిరగబోతోందో అన్న ఆసక్తి ఏర్పడుతోంది.