ఏపీ పోలీసులు మొత్తం వదిలేశారు. కిడ్నాప్ లు, గంజాయి స్మగ్లింగ్లే కాదు.. విధి నిర్వహణలో రాజ్యాంగ ఉల్లంఘనల్లోనూ హైకోర్టుతో చీవాట్లు తింటున్నారు. ఎవరో ఒక ఉన్నతాధికారిని జైలుకు పంపితే తప్ప ఏపీ పోలీసుల పనితీరు మెరుగుపడదా అని హైకోర్టు స్వయంగా వ్యాఖ్యానించే పరిస్థితి ఏర్పడింది. పోలీసులపై హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసుల వ్యవహారాన్ని.. వారి పనితీరును మరోసారి ప్రజల ముందు చర్చకు పెట్టాయి. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పర్చూరులో ఇటీవల క్వారీలపై మైనింగ్ శాఖ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి సోదాలు చేశారు.
ఈ విషయంపై పర్చూరు ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ పై హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు రాజ్యాంగవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. చట్ట పరంగా నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పోలీసుల వ్యవహారంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలే అరెస్టు చేస్తారని భయపడుతూంటే ఇక సామాన్యుల పరిస్థితేమిటని ప్రశ్నించింది. ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాలి .. నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటే అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని హైకోర్టు ప్రశ్నించారు. అరెస్టు చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కొంటారని… బాధ్యులైన అధికారి అరెస్టుకు ఆదేశాలిస్తామని స్పష్టం చేసిన హైకోర్టు హెచ్చరించింది. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసారు.
వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరండతో విచారణ మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. నిజానికి ఏపీ పోలీసులు .. ప్రభుత్వ పెద్దలకు ఇష్టం లేని వారిపై గాలి పోగేసి కేసులు పెట్టేసి అరెస్టులు చేస్తున్నారు. వర్గాలను రెచ్చగొట్టారని..అవినీతి అని.. కనీస సాక్ష్యాలు కూడా లేకుండా అరెస్టులు చేస్తున్నారు. అయినా ఏ వ్యవస్థా రక్షించలేదు. ఇది పీక్స్ కు చేరడంతో హైకోర్టు ఘాటుగా స్పందించింది. అయితే డీజీపీని జైలుకు పంపినా ఏపీలో పోలీసులు మారరని టీడీపీ సెటైర్లు వేస్తోంది.