బీజేపీ ఎంపీ, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లో చండీఘడ్ ఎయిర్ పోర్టులో ఓ సెక్యూరిటీ ఉద్యోగిని చేయి చేసుకున్నారు. రైతులపై కంగనా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆ దాడి చేసినట్లుగా సీఐఎస్ఎఫ్ జవాన్ అయిన ఆమె చెప్పుకున్నారు. దాంతో చాలా మంది ఆమెకు అనుకూలంగా … వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. ధర్మాగ్రహం అని కొంత మంది సమర్థిస్తున్నారు. అయితే భౌతిక దాడి అనేది ధర్మాగ్రహం ఎప్పటికీ కాదు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదు.
కంగనాపై దాడికి సమర్థనలు అసహ్యం
చండీగఢ్ విమానాశ్రయంలో సి.ఐ.ఎస్.ఎఫ్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ కొత్తగా ఎంపీగా ఎన్నికయిన సినీనటి కంగనారనౌత్ పై దాడి చేసింది. కంగనా రనౌత్ బాలీవుడ్ హీరోయిన్. అందరికీ తెలిసిన నాయికనే. మోడీ కి అత్యంత భక్తురాలు. ఆయన ఏదిచేసినా వందశాతం సరైనదేనని నిర్మోహమాటంగా వాదించేంత భక్తురాలు. అది ఆమె ఇష్టం. ఆమె అభిప్రాయాలను ఖండివచ్చు.. కానీ దాడి చేయడానికి మాత్రం ఎవరికీ హక్కు లేదు. కానిస్టేబుల్ కుల్వీందర్కౌర్ రక్షణ కల్పించేందుకు ఎయిర్ పోర్టులో ఉన్నారు. కానీ ఆమె ప్రయాణికురాలి మీద దాడి చేయడం.. చిన్న విషయం కాదు.
రైతులపై కంగన వ్యాఖ్యలు కూడా తప్పే !
నల్ల చట్టాలపై పోరాడుతున్న రైతులపై కంగనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ హక్కులకోసం పోరాటం చేస్తున్న రైతుల ఆందోళనను ఉద్దేశించి ఆందోళన చేస్తున్న వాళ్లందరూ వందో, రెండువందలో డబ్బు తీసుకుని వచ్చిన వాళ్లేనని అంటే కిరాయి ఆందోళనగా అభివర్ణించింది. అంతేకాదు వాళ్లందరూ దేశద్రోహులని, ఖలీస్థానీ సపోర్టర్లని కూడా చెప్పింది. ఈ వ్యాఖ్యలను చాలా మంది ఖండించారు. దేశంలో అత్యధిక మంది వ్యతిరేకిస్తారు కూడా.
ధర్మాగ్రహం పేరుతో దాడులు చేస్తే అరాచకమే !
దేశంలో వ్యవస్థలు ఉన్నాయి. కంగనా తప్పు చేస్తే శిక్షకు గురవుతారు. లేదంటే లేదు. మనకు వాక్ స్వాతంత్రాన్ని రాజ్యాంగం ఇచ్చింది కానీ ధర్మాగ్రహం పేరుతో దాడులు చేయమని సేచ్చ ఇవ్వలేదు. గతంలో ఏపీలో రాళ్లు వేస్తే అభిప్రాయ వ్యక్తీకరణ అని ఓ డీజీపీగా సెలవిచ్చారు. అ ఆరాచకం ఏపీని ఏ స్థాయికి తీసుకెళ్లిందో. రేపు మరొకరు..తమను కించపరిచారని హత్యలు కూడా చేయవచ్చు. ఇలాంటివి ఏ మాత్రం ప్రోత్సహించినా అవి సమాజానికి హానికరమే. ఈ విషయం కంగనా మాత్రమే కాదు.. ఎవరు ఉన్నా అంతే. ధర్మాగ్రహం పేరుతో దాడులు .. వాటికి సమర్థనలు అరాచకమే.