ఐపీఎల్ మళ్లీ దుబాయ్‌కే చేరింది. మధ్యలో అగిపోయిన ఐపీఎల్‌ను దుబాయ్‌లో కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ పందొమ్మిదో తేదీ నుంచి అక్కడ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇంగ్లాండ్‌తో పాటు శ్రీలంక కూడా మిగిలిన ఐపీఎల్ నిర్వహణకు తమ అంగీకారం తెలిపినా అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని దుబాయ్‌నే బీసీసీఐ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 60 మ్యాచ్‌లకు గాను 29 మాత్రమే పూర్తయ్యాయి. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఐపీఎల్, ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా నేరుగా యూఏఈ చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
కరోనా కారణంగా సగం సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ముంబయి, చెన్నై వేదికలు సవ్యంగానే సాగాయి. ఢిల్లీ, అహ్మదాబాద్‌కు వేదికలు మార్చిన తర్వాత.. ప్రయాణాలు, ఇతర కారణాల వల్ల ఆటగాళ్లకు వైరస్ సోకింది. కోల్‌కతాలో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, హైదరాబాద్‌లో వృద్ధిమాన్ సాహా, దిల్లీలో అమిత్ మిశ్రా, చెన్నైలో బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లు మైక్ హస్సీ, లక్ష్మీపతి బాలాజీకి పాజిటివ్ వచ్చింది. దాంతో సీజన్‌ను వాయిదా వేయక తప్పలేదు. రెండున్నర వేల కోట్ల నష్టం తేలడంతో ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించి ఆ మేరకు సక్సెస్ అవుతోంది.
గత ఏడాది ఐపీఎల్ కూడా.. గల్ఫ్ లోనే జరిగింది. అప్పుడు కూడా కరోనా కేసులే కారణం. ఇప్పుడు కరోనా వల్ల సమస్యలేదనుకుని టోర్నీని ప్రారంభిస్తే.. సగం జరిగేసరికి మొత్తం తేడా వచ్చేసింది. చివరికి దుబాయ్‌కే చేరింది. ఆటగాళ్లందర్నీ.. నిబంధనల ప్రకారం.. క్వారంటైన్లో ఉంచాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇతర టీముల షెడ్యూల్‌తో కూడా క్లాష్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కొంత మంది స్టార్ ప్లేయర్లు మిస్ అవుతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.