భారతీయ జనతా పార్టీ ఏపీ ప్రభుత్వంపై సమరభేరి మోగించింది. ప్రజా సమస్యలపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. దాంతో సోము వీర్రాజు సహా…విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు లాంటి పెద్ద పెద్ద నేతలంతా… రోడ్ల మీద రాస్తారోకోలు చేశారు. చెరువుల్లా మారిన రోడ్లు.. గుంతలు పడిన రోడ్ల వద్ద వారు రాస్తారోకోలు చేశారు. పలు చోట్ల.. వాహనదారులు వారితో గొడవ పడ్డారు. అసలు రోడ్లు బాగోలేక ప్రయాణాలు నెమ్మదిగా సాగుతూంటే.. రాస్తారోకోలేమిటని వాదనలు పెట్టుకోవడంతో.. కొన్ని చోట్ల వెంటనే విరమించుకున్నారు. ఏ
పీ ప్రభుత్వంపై పోరాడటానికి చాలా అంశాలున్నాయి. అయితే బీజేపీ మాత్రం రోడ్ల అంశాన్ని తీసుకుంది. వైసీపీ మాత్రం..బీజేపీ ఆందోళనలను సీరియస్గా తీసుకోలేదు. పట్టించుకోలేదు. వాస్తవానికి ఎలాంటి ఆందోళనలు నిర్వహించినా… భారతీయ జనతా పార్టీ.. తన మిత్రపక్షం జనసేనను సంప్రదించాల్సి ఉంది. కానీ రోడ్ల విషయంలో ఆందోళనల విషయంలో బీజేపీ సొంత నిర్ణయం తీసుకుంది. దీంతో జనసేన కార్యకర్తలెవరూ.. బీజేపీతో పాటు రోడ్ల ఆందోళనల్లో పాలు పంచుకోలేదు.
మరో వైపు.. పవన్ కల్యాణ్.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ వరద బాధితుల్ని పరామర్శిస్తున్నా.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా బీజేపీ నేతలు పవన్ తో పాటు రావడం లేదు. ఈ పరిణామాలన్నీ.. బీజేపీ, జనసేన మధ్య పొసగని వ్యవహారంలా ఉందన్న చర్చ రావడానికి కారణం అవుతోంది. పొత్తులో ఉన్నందున బీజేపీకి చెప్పిన తర్వాత రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తామని గతంలో రెండు పార్టీల నేతలు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి వారు కార్యక్రమాలు చేపడుతున్నారు.