ఆంధ్రప్రదేశ్ మంత్రుల అవినీతిపై బీజేపీ వ్యూహాత్మక ఎదురుదాడి చేస్తోంది. ఆరోపణలతో ఇరుకున పెడుతోంది. ఓ మంత్రికి … ఓ అధికారి మూడు కోట్లతో బంగ్లా కట్టిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపణలు చేస్తే..వెంటనే కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు. తననే సోము వీర్రాజు అన్నారని ప్రెస్‌మీట్ పెట్టి మరీ… తనకెవరూ బంగ్లా కట్టించి ఇవ్వలేదని.. కావాలంటే సీబీఐ విచారణ చేసుకోవచ్చని సవాల్ చేశారు. దీంతో.. గుమ్మడికాయ దొంగ అంటే… భుజాలు తడుకోవడం ఏమిటని… కొడాలి నాని పేరును తాము ఎక్కడ చెప్పామని సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారు. దీంతో.. కొడాలి నాని నాలిక కరుచుకోవాల్సి వచ్చింది.
తనంతట తాను ఆయన మీడియా ముందుకు రావడంతో… వైసీపీ నేతలకూ కూడా ఇబ్బందికరంగా మారింది. ఎలా సమర్థించుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నేతలు.. ఈ పరిస్థితిని అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు. మంత్రులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని.. అలాంటి వారందరి చిట్టా తమ దగ్గర ఉందని అంటున్నారు. తక్షణంలో అధికారి దగ్గర బంగ్లాను లంచంగా తీసుకున్న మంత్రితో పాటు గతంలో బెంజ్ కారు బహుమతిగా తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మంత్రులపై ఆరోపణలతో మంచి మైలేజ్ వచ్చే అవకాశం కనిపిస్తూండటంతో… బీజేపీ నేతలు ఇతర మంత్రులపై ఉన్న ఆరోపణలు.. వారి సీక్రెట్ బిజినెస్ గురించి సమాచారం సేకరిస్తున్నారు. అందరిపై సాక్ష్యాలతో సహా ఆరోపణలు చేసి.. తమ మైలెజ్ పెంచుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో.. వారిపై ఒత్తిళ్లు రావడం సహజం. వారెలా స్పందిస్తారన్నదానిపైనే…బీజేపీ నేతల సీరియస్ నెస్ ఆధారాపడి ఉంటుందని అంచనా వేయవచ్చు.