వెనకబడ్డ బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తన ప్రణాళిక ఏమిటో బీజేపీ వివరించింది. విజన్ డాక్యుమెంట్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. పాట్నాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో విడుదల చేసిన ఈ డాక్యుమెంటు లోని అంశాలను పరిశీలిస్తే, ప్రజలకు హామీలిస్తూనే, మరీ అడ్డగోలు ఉచిత వాగ్దానాలు చేయకుండా జాగ్రత్త పడిందని అర్థమవుతుంది. అభివృద్ధికి అవసరమైన నిర్మాణాత్మక కృషి చేయడం, యువతకు ప్రాధాన్యం, రైతులకు ఊరటనిచ్చే హామీలు ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా, రైతులకు వడ్డీలేని రుణం ఇస్తామనే హామీ కీలకమైంది. రైతు ఆత్మహత్యలు ఆగాలంటే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఇటీవల సామాజిక కార్యకర్త అన్నా హజారే సూచించారు. ఇంకా ఎంతో మంది ఇలాంటి సలహానే ఇచ్చారు. బీజేపీ సరిగ్గా అదే చేస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయం, అనుబంధ అవసరాల కోసం రోజులో 12 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. వ్యవసాయానికి సంబంధించి మరికొన్ని హామీలనూ డాక్యుమెంటులో పొందుపరిచారు.
యువతపై ఫోకస్ చేస్తూ, పది, పన్నెండో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ ఇస్తామని ప్రకటించారు. ఇలా ఏటా దాదాపు 50 వేల మందికి పంపిణీ చేస్తారట. అలాగే ఏటా దాదాపు 5 వేల మంది బాలికలకు టూవీలర్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 10, 12 వ తరగతిలో ప్రతిభ ఆధారంగా వీటిని పంపిణీ చేస్తారు. విద్యార్థులకు విద్యా రుణాలను 3 శాతం వడ్డీకే అందజేస్తారు. వృత్తి విద్యో కోర్సుల్లో చేరిన వారికి స్కాలర్ షిప్ లు, ఇంకా ఇతర హామీలు అదనం. రాష్ట్రంలో భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయడం, ఇంటి నిర్మాణానికి సహాయం చేయడం వంటి హామీలూ ఉన్నాయి. దళితులు, మహా దళితులకు ఉచితంగా కలర్ టీవీలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇది తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన పథకం.
బీజేపీ డాక్యుమెంటులో ప్రజలకు మేలు చేసే పనులపై హామీలు ఇవ్వడమే కాదు, వారు బాధ్యతగా వ్యవహరించేలా చూసే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వ సంస్థల నుంచి ఎవరికైనా రుణం కావాలంటే, వారి ఇంట్లో తప్పనిసరిగా టాయిలెట్ ఉండి తీరాలి. అలాగే లాప్ టాప్ లు, టూవీలర్లను ఎవరికి పడితే వారికి, లేదా కులాల ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఇస్తామనడం కూడా బాధ్యతతో కూడిన హామీనే. విద్యార్థులు శ్రద్ధగా చదవడానికి ఇది ప్రేరణనిస్తుంది. తద్వారా వారి మంచి భవిష్యత్తుకు పునాది పడే అవకాశం ఉంది.
బీజేపీ హామీల్లో ఎక్కడా ఆచరణ సాధ్యం కాదని ఉచితాలు, లేదా ఫ్రీబీస్ హామీలు లేవు. రైతులకు వడ్డీలేని రుణం ఇస్తామన్నారే తప్ప, రుణాల మాఫీ హామీ ఇవ్వలేదు. రుణ మాఫీ సరైన విధానం కాదని రిజర్వ్ బ్యాంకే కాదు, అన్నా హజారే వంటి వారూ చెప్పారు. అందుకే, బీజేపీ తార్కికంగా ఆలోచించి హామీలిచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.