మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు అంశాలపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై విచారణ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి సారి హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ మహేశ్వరి బదిలీపై వెళ్లడం వల్ల అప్పటి వరకూ జరిగిన వాదనలు ఉపయోగం లేకుండా పోయాయి. కొత్త సీజే నేతృత్వంలో మళ్లీ మొదటి నుంచి వాదనలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కరోనా కారణంగా అటు ప్రభుత్వం.. ఇటు పిటిషనర్లు కూడా వాయిదాలు కోరుకోవడంతో జస్టిస్ జే.కే మహేశ్వరి తర్వాత వచ్చిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలో కూడా విచారణ సాగలేదు.
ఈ నవంబర్‌లో విచారణ చేయాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు నవంబర్‌లో హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే హైకోర్టు సీజే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటయింది. హైబ్రీడ్ విధానంలో విచారించనున్నారు. కొంత మంది లాయర్లు ప్రత్యక్షంగా.. మరికొంత మంది ఆన్ లైన్ పద్దతిలో వాదనలు వినిపించనున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు రాజధానులు చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే అప్పటికే అమరావతికి భూములిచ్చిన రైతులు ప్రభుత్వం ఒప్పందాల్ని ఉల్లంఘిస్తోందని.. సీఆర్డీఏ తమతో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ దాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తూ కోర్టుకెళ్లారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారు. తమను అన్యాయం చేయవద్దంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రకరకాల కారణాలు చెబుతూ విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చెబుతోంది. కానీ ముందడుగు వేయలేకపోయింది. ఇక హైకోర్టే ఈ వివాదాన్ని తేల్చాల్సి ఉంది. రోజువారీ విచారణ జరిగితే ఐదారు నెలల్లో తీర్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.