రాజధాని అంటే ఏంటి ? . రాజధాని అంటే జాతి సామర్థ్య చిహ్నం. ఎంత గొప్పగా ఉంటే మన జాతి అంత గొప్పగా ఉందని ప్రపంచం భావిస్తుంది. అందుకే ఢిల్లీని మరింత సుందరంగా మారుస్తున్నారు నరేంద్రమోడీ. అక్కడ సెంట్రల్ విస్టా పేరుతో రూ. పాతిక వేల కోట్లు పెట్టి కొత్తగా కడుతున్న కాంప్లెక్స్‌ల గురించి ఆయన ఈ మాటలు మాట్లాడారు. ఈ మాటలను ఎవరూ కాదనలేరు. రాజధాని అనేది జాతి సామర్థ్య చిహ్నమే. విభిన్న సంస్కృతులు.. రాష్ట్రానికి రాష్ట్రానికి స్పష్టమైన తేడా ఉన్న ఇండియాలో అయితే ఆయా రాష్ట్రాలకు రాజధానులు ఆర్థిక సామర్థ్యానికి కూడా చిహ్నాలే.
అందుకే అన్ని రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల రాజధానుల్ని వీలైనంత వరకూ తమ సామర్థ్యాన్ని చిహ్నంగా మార్చుకుంటున్నాయి. మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది సహజమే. అందరిలోనూ ఆంధ్రులు కాస్త ఎక్కువే కాబట్టి ఏకంగా మూడు జాతి సామర్థ్య చిహ్నాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఏది అసలైన రాజధానో స్పష్టత లేకపోయినా ఆంధ్రులకు పట్టింపు ఉండదు. జాతి సామర్థ్యం రాజధాని మీదే ఉంటుందని ఆంధ్రులు అసలు అనుకోరు. ఏదైనా ముఖ్యమంత్రి ఎక్కడి నుంచిపరిపాలిస్తే అదే రాజధానిగా ఫిక్సయిపోతారు. అది పులివెందుల అయినా పర్వాలేదు. దాన్నే జాతి సామర్థ్యాన్ని చిహ్నంగా చూసుకుంటారు.
రాజధాని అనే దానిపై ఇంత స్పష్టమైన అవగాహన ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు అని చెబుతూంటే ఎందుకు సమర్థించారో ఆంధ్రులే అర్థం చేసుకోవాలి. తను స్వయంగా శంకుస్థాపన చేసిన రాజధానిని రాజధాని కాదంటే మంచి చెడూ చెప్పాల్సిన వారే అలాగే చేయమని ప్రోత్సహించారంటే ఎందుకు చేశారో ఆంధ్రులు అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వారికి జాతి సామర్థ్యం నిరూపితమవుతుంది . లేకపోతే ప్రధానమంత్రి మాటలు వింటూ … గొప్పలు చెప్పుకుంటూ బతకాల్సిందే..!!