ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను జూలై ఎనిమిదో తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు. ఆ రోజునే షర్మిల రాజకీయ పార్టీని లాంఛ్ చేయబోతున్నారు. అదే రోజున సీబీఐ కోర్టు కీలకమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గురువారం జరిగిన విచారణలో సీబీఐ తరపు న్యాయవాదులు ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకూ మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోండి అని.. సీబీఐ కోర్టుకే చాయిస్ వదిలేసిన సీబీఐ .. కొత్తగా తాము లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని స్పష్టం చేసింది.
గతంలో సీబీఐ మెరిట్ ప్రకారం నిర్ణయం అనే కౌంటర్ దాఖలు చేసిన సమయంలోనే కొత్త సీబీఐ చీఫ్ వచ్చారు. ఇప్పుడు కేసుల్లో సీబీఐ తీరు మారుతుందన్న అంచనాల నేపధ్యంలో.. లిఖిత పూర్వక వాదనలు వినిపిస్తామని చెప్పడం ఆసక్తి రేపుతోంది. విచారణ సందర్భంగా రఘురామ తరపు న్యాయవాదులు ఎక్కువగా అధికార దుర్వినియోగం.. సాక్షుల ప్రభావితం అంశాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు పోస్టింగ్లు ఇవ్వడం.. పిటిషనర్ అయిన రఘురామపై తప్పుడు కేసులు.. ధర్డ్ డిగ్రీ ప్రయోగం వంటివి సాక్ష్యాలుగా చూపించారు.
అయితే బలమైన సాక్ష్యాలు చూపించాలంటూ.. జగన్ లాయర్లు వాదించారు. అసలు ఈ పిటిషన్ వేసే అర్హత రఘురామకు లేదని.. పాత వాదనే వినిపించారు. రాజకీయ ఉద్దేశాలతో కోర్టును వాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ వాదనలన్నీ విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. మూడు పక్షాలను లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. జూలై ఎనిమిదో తేదీన ఎలాంటి డెలవప్మెంట్ వచ్చినా అది వైసీపీకి బ్రేకింగ్ న్యూస్ అవుతుంది.