ముఖ్యమంత్రి జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. సమాధానం చెప్పాలని అన్ని కేసుల్లో ఏ – వన్‌గా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు.. సీబీఐకి కూడా సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి బెయిల్ రద్దు అంశంపై వాదనలు జరగనున్నాయి. ఇప్పుడు అందరి చూపు సీబీఐ వైపు పడనుంది. సీబీఐ వాదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన సందర్భంలో… సీబీఐ అభ్యంతరం చెప్పకపోవడంతోనే బెయిల్ వచ్చింది.
ఇప్పుడు బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని… సీబీఐ కూడా.. సీబీఐ కోర్టులో వాదిస్తే.. రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు మరింత బలం చేకూరుతుంది. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదనేది.. బెయిల్ షరతుల్లో ప్రధానమైనది. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సహనిందితులకే ఎక్కువ పదవులు కట్టబెట్టారు. నిందితులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పిస్తున్నారు. అలాగే.. కోర్టు విచారణలకు కూడా హాజరు కావడం లేదు. వీటన్నింటినీ సీబీఐ కూడా గుర్తించి.. బెయిల్ షరుతులు ఉల్లంఘిస్తున్నారని వాదిస్తే.. బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఇదే అంశంలో సీఎం జగన్ కూడా.. తన వాదన వినిపించనున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయించిన తర్వాతనే తాను ఏపీలో అడుగుపెడతానని రఘురామకృష్ణరాజు సవాల్ చేశారు. ఆ మేరకు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి.. తొలి అడుగులో విజయం సాధించారు. ఆ పిటిషన్‌ను విచారణ స్థాయికి తీసుకు వెళ్లారు. రఘురామకృష్ణరాజు చాలెంజ్ ప్రకారం.. జగన్ బెయిల్ రద్దు చేయించేలా.. లాయర్లతో వాదించగలిగితే.. ఆయన ఇమేజ్ అమాంతం పెరుగుతుంది.