న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ అధికారులు నింపాదిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏడాది దాటిపోయినా ఇంకా మూడు నెలల సమయం కావాలంటూ తాజాగా హైకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేశారు. గతంలో సీబీఐకి ఇచ్చిన గడువు అయిపోవడంతో ఈ రోజు విచారణ జరిగింది. ఇప్పటికే మూడు స్టేటస్ రిపోర్టులు దాఖలు చేశామని.. తుది నివేదిక ఇచ్చేందుకు మూడు నెలల సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు మరో మూడు నెలల సమయం ఇచ్చింది. చీఫ్ జస్టిస్‌గా జేకే మహేశ్వరి ఉన్నప్పుడు.. ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయన్న ఉద్దేశంతో న్యాయమూర్తులపై వైసీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దాడి చేశారు.
ఓ పోస్టులో అయితే గదిలో వేసి నరికేస్తామని చెప్పారు. వారికి తోడు.. వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కోర్టులపై అనుమచిత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు సైతం ఉద్దేశాలు ఆపాదించేలా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. వీటన్నింటిపై హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. కేసులు పెట్టారు. అయితే … సీఐడీ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. చివరికి.. హైకోర్టు సీఐడీకి దర్యాప్తు చేసే ఉద్దేశం లేదని అనుకుందో ఏమో కానీ.. సీబీఐకి ఇచ్చింది. కొంత మంది విదేశాల్లో ఉండి పోస్టులు పెట్టడం.. విదేశాల్లో ఉండి న్యాయమూర్తుల్ని చంపుతామని బెదిరించడం వంటి వీడియోలు ఉన్న కారణంగా సీబీఐకి ఇస్తున్నట్లుగా హైకోర్టు తెలిపింది.అప్పట్నుంచి సీబీఐ విచారణ జరుపుతూనే ఉంది. కానీ ఏమీ తేల్చడం లేదు.
ఓ సారి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు నోటీసులు ఇచ్చారు. అంత వరకే బయటకు తెలిసిన విచారణ సాగింది. ఓ పద్దతి ప్రకారం.. న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిలింగ్ చేయడానికి సోషల్ మీడియాను వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గట్టిగా విచారణ జరిగితే.. ఆ సోషల్ మీడియా నెట్ వర్క్ అంతా బయటకు వస్తుందన్న చర్చలు ఉన్నాయి. కానీ ఎందుకో కానీ సీబీఐ నెలల తరబడి గడువు తీసుకుంటూనే ఉంది. ఏపీ హైకోర్టు విచారణకు ఆదేశించిన అన్ని కేసుల్లోనూ ఇదే పరిస్థితి.