తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ చేసిన వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం నలుగురు కీలక వ్యక్తుల్ని అరెస్టు చేసింది. వీరంతా నెయ్యి సరఫరా దారులే. కానీ వీరెవరికి తిరుమలకు నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం లేదు. ఒకరి దగ్గర ఒకరు కొని..దానికి మరింత కల్తీ చేసి సరఫరా చేస్తున్నారు. అంటే అందరూ పాత్రధారులే. అసలు వీరికి టెండర్లు ఇచ్చింది ఎవరు… వీరందర్నీ కలిపి సిండికేటుగా మార్చింది ఎవరు … కల్తీ చేసిన కమిషన్ డబ్బులు కొట్టేసింది ఎవరు అన్నది తేల్చేందుకు సీబీఐ క్రమంగా అడుగులు వేస్తోంది.
అరెస్టు చేసిన నలుగుర్ని కస్టడీకి తీసుకునేందుకు సీబీఐ సిట్ రెడీ అవుతోంది. అలాగే మొత్తం నెయ్యి టెండర్ ప్రాసెస్ లో పాల్గొన్న వారిని .. కాంట్రాక్టులు ఇచ్చే ముందు క్షేత్ర స్థాయిలో ఆయా సంస్థల్ని.. అంటే ఏఆర్ డెయిరీని పరిశీలించిన వారిని కూడా ప్రశ్నించనున్నారు. కల్తీ వ్యవహారం బయటపడినప్పుడు ఏఆర్ డెయిరీ చాలా కాన్ఫిడెంట్ గా తమ సామర్థ్యం గురించి ప్రకటనలు చేసింది. తీరా చూస్తే అది చాలా చిన్న డెయిరీ అని తేలింది. ఎవరు ఈ డెయిరీని తిరుమల టెండర్ల వరకూ తీసుకు వచ్చారన్నది కీలకంగా మారనుంది.
తన హయాంలో ఏఆర్ డెయిరీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఏఆర్ డెయిరీ ఎంట్రీ ఇచ్చింది. అంటే ఈ వ్యవహారంలో భూమనకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ చీఫ్ నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు కాబట్టి.. ఎక్కడా ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తి స్థాయిలో నిజాలు వెలికి తీస్తారని అంచనా వేస్తున్నారు.