వరి ధాన్యం కొంటరా ? కొనరా ? అని కేంద్రానికి ధర్నాలు చేసి మరీ ప్రశ్నలు వేస్తున్న కేసీఆర్కు సూటిగానే సమాధానం వచ్చింది. బుధవారం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేశారు. ఈ ధర్నా చేస్తున్న సమయంలోనే కేంద్రమంత్రి ఓ ప్రకటన చేశారు. ధాన్యాన్ని కేంద్రం తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. వచ్చే సీజన్లో కూడా పరిమితంగానే కొంటామని ఎంత కొంటామన్నది రాష్ట్ర ప్రభుత్వాలతో త్వరలో జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.
వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నామని.. ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నాని ప్రకటించారు.ఆయిల్, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నామని ప్రకటించారు. కేంద్రం కొనేది లేదని నేరుగా చెప్పడంతో ఇప్పుడు టీఆర్ఎస్ చేతేకి ఆయుధం వచ్చినట్లయింది.
తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేదని ఆరోపిస్తూ యాత్రలు చేస్తున్నారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం చేసిన ప్రకటన తెలంగాణ బీజేపీ నేతలకు ఇబ్బందికరమైనదే. అయితే వారు దాన్ని కూడా తమకు అనుకూలంగా మల్చుకుని టీఆర్ఎస్పై ఎదురుదాడి చేయగల రాజకీయం నేర్చుకున్నారు. అందుకే ఇప్పుడు వరి రాజకీయం తెలంగాణలో మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.