బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు సాంకేతికంగా ఏపీతో పని లేదు. ఆయన ఉత్తరప్రదేశ్ ఎంపీ. కానీ ఆయన యూపీ కంటే ఏపీపైనే ఎక్కువ స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయనకు ఏపీలోనే ఎక్కువ పని పెట్టాలని కేంద్ర బీజేపీ అనుకున్నట్లుగా కనిపిస్తోంది. పోగాకు బోర్డు సభ్యుడిపదవిని తాజాగా ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పొగాకు బోర్డు గుంటూరులో ఉంది. దీంతో జీవీఎల్ ఇక ఏపీలో ఎక్కువగా రాజకీయాలు చేయడానికి.. తరచూ పర్యటించడానికి అవకాశం ఉంటుంది.
జీవీఎల్ నరసింహారావు వల్ల బీజేపీకి ఏమైనా ఉపయోగం ఉందో లేదో ఎవరికీ స్పష్టతలేదు కానీ.. ఆయన మాత్రం బీజేపీ హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడితో రాష్ట్రంలో ప్రముఖ నేతగా ఎదిగారు. టీడీపీ హయాంలో ఆయనకు మీడియా విస్తృత ప్రాధాన్యం ఇచ్చేది. ఆయన ఏమన్నా హెడ్ లైన్స్‌లో వచ్చేవి. అలాంటి విమర్శలు ఆయన చేసేవారు. అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తరవాత ఆయన మాటలకు ప్రాధాన్యత దక్కడం లేదు. ఆయన వైసీపీ సానుభూతిపరుడిగా ప్రచారం జరగడమే దీనికి కారణం.
ఏమైనా రాజకీయ విమర్శలు చేయాలన్నా.. ముందుగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని విమర్శించి.. చివరికి వైసీపీని ఒకటి రెండు మాటలంటారు. ఇలాంటి ధోరణి వల్ల బీజేపీ పైనా ప్రజల్లో వైసీపీ ఫేవర్ అనే ముద్రపడింది. అయితే ఇటీవలి కాలంలో జీవీఎల్ కూడా ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ గట్టిగా వినిపిస్తున్నాయి. అమిత్ షా దిశానిర్దేశంతో సీన్ మారిపోయిందని భావిస్తున్నారు. మరి పొగాకు బోర్డు సభ్యుని పదవి తీసుకుని సర్కార్‌పై ఎంత పోరాటం చేస్తారో చూడాల్సి ఉంది.