రాష్ట్రాల్లో ఏర్పడిన కరెంట్ సంక్షోభం అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. బొగ్గు కొరత రాదని.. రానివ్వబోమని చెబుతున్న కేంద్రం కొన్ని రాష్ట్రాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు కోతలు విధించి ఎక్స్చేంజీలలో కరెంట్‌ను అత్యధిక రేటుకు అమ్ముకుంటున్నారని మండిపడింది. వినియోగదారులకు ఇవ్వకుండా విద్యుత్ అమ్ముకోకూడదని స్పష్టం చేసింది. ఎక్కువ ధర కోసం విద్యుత్ అమ్ముకునే రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఎవరికైనా మిగులు విద్యుత్ ఉంటే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలి కానీ అత్యధిక రేటుకు పవర్ ఎక్స్ఛేంజ్లలో అమ్మడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. అలాగే కొన్ని రాష్ట్రాలు ప్రజలకు కోత విధించి మరీ అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ సరఫరా బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే నని..మిగులు ఉన్న రాష్ట్రాలు ఆ విషయం కేంద్రానికి తెలియచేయాలని ఆదేశించింది. మిగులు ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం పవర్ ఎక్స్ఛేంజీలో విద్యుత్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కొన్ని రాష్ట్రాలు తమ ప్రజలకు కరెంట్ కోతలు విధించి మరీ అమ్ముకుంటున్నాయి.
ఈ విషయం తెలిసి కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కరెంట్ సంక్షోభం కారణంగా రాష్ట్రాలకు కేంద్రం చేసిన హెచ్చరికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే అలాంటి రాష్ట్రాలు ఏమిటన్నదానిపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎక్స్ఛేంజీలో ప్రైవేటు కంపెనీలు కాకుండా విద్యుత్ అమ్మే ప్రభుత్వాలన్నీ అదే పని చేస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.