దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచిత టీకాలు వేసే కార్యక్రమాన్ని కేంద్రం ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున ప్రారంభించింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒక్క రోజే 70 లక్షల మందికిపైగా టీకాలు వేసినట్లుగా తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ప్రారంభించిన తర్వాత ఇదే అత్యధిక మొత్తం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజే దాదాపుగా పదమూడు లక్షల మందికి వ్యాక్సిన్ వేసి అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. ఒక్క రోజు ముందే.. పదమూడున్నర లక్షల మందికి టీకాలు వేసి.. దేశం మొత్తం తమ వైపు చూసిందని ప్రకటించుకున్న ఏపీ సర్కార్.. అసలైన ఈవెంట్ రోజు మాత్రం.. పూర్తిగా వెనుకబడిపోయింది.
సోమవారం కేవలం 41వేల టీకాలు మాత్రమే ప్రజలకు పంపిణీ చేసినట్లుగా కోవిన్ యాప్లో రికార్డయింది. వ్యాక్సిన్ వేయాలంటే రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి కాబట్టి… అందులో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంది. ఈ ప్రకారమే.. ఏపీ రికార్డు కూడా.. యాప్లో నమోదయింది. ఒక్క రోజే దాదాపుగా పడదమూడున్నర లక్షల మందికి టీకాలు ఇచ్చి తర్వాతి రోజు.. కనీసం లక్ష మందికి కూడా ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కేంద్రం రాష్ట్రాలకు పెద్ద ఎత్తున టీకా డోసులు పంపుతోంది. తయారీ దారుల నుంచి 75 శాతం కేంద్రమే కొనుగోలు చేస్తోంది.
ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తోంది. ఏపీ కోటా.. ఏపీకి అందుతోంది. అయినా పరిమితంగా వ్యాక్సినేషన్ వేస్తున్నారు. బహుశా.. ఈ సారి ఇరవై లక్షలు ఒకే రోజు వేయాలన్న టార్గెట్ పెట్టుకుని .. పరిమితంగా వేస్తున్నారేమోనన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రాల వద్ద పెద్ద ఎత్తున డోసుల నిల్వ ఉందని.. కేంద్రం చెబుతూ ఉంటుంది. ఏపీలో ఎన్ని డోసులు ఉన్నాయో క్లారిటీలేదు. ఏపీలో వ్యాక్సినేషన్ ఓ క్రమ పద్దతిలో సాగడం లేదు. ఒక రోజు లక్షల్లో.. మరో రోజు.. వేలల్లో వేస్తున్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.