అమ్మో ఒకటో తేదీ అని ఏపీ ప్రభుత్వ పెద్దలు అనుకుంటారో లేదో కానీ… జగన్ ప్రభుత్వానికి ఎక్క నొప్పి తగులుతుందో అని కేంద్రం మాత్రం ముందుగానే బాధపడుతుంది. అనుమతి ఇచ్చిన పరిమితి దాటిపోయి ఇంకా పది వేల కోట్లు ఎక్కువగానే అప్పు చేసినప్పటికీ కొత్తగా మరో రూ. 1413 కోట్లు అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇలా అనుమతి రావడం ఆలస్యం అలా మొత్తానికి ఆర్బీఐలో ఇండెంట్ పెట్టేశారు. రేపు మంగళవారం ఆ డబ్బులు బాండ్ల వేలం ద్వారా.. ఏపీ ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికే జీతాలు.. పెన్షన్లు ఇవ్వడానికి ఓడీ తీసుకున్నందున ఆ మొత్తం వాటికి జమ చేస్తారని చెబుతున్నారు.
అప్పులు, వడ్డీలు తీర్చడానికే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని పరోక్షంగా నిర్మలా సీతారామన్ విమర్శిస్తున్నారు. కానీ అప్పులు చేయకుండా నియంత్రించలేకపోతున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కనీసం నిబంధనల ప్రకారం వ్యవహరించామని కూడా ఆదేశించలేకపోతున్నారు. ప్రభుత్వం చేసే విచ్చలవిడి అప్పులు కేవలం వడ్డీలు కట్టుకోవడానికి జీత భత్యాలకే సరిపోతున్నాయి. అభివృద్ధి పనులకు రూపాయి కేటాయించడం లేదు. చిన్న చిన్న పనుల కాంట్రాక్టర్లకూ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అభివృద్ధే లేకుండా పోయింది.
ఇలా వేల కోట్లు అప్పులు చేస్తున్నప్పటికీ ఆ సొమ్ములన్నీ ఎటు పోతున్నాయో ఎవరికీ తెలియడం లేదు. లెక్కలు లేవు. రూ. యాభై వేల కోట్లు కల్లంతయ్యాయని వివరాలు కావాలని కాగ్ అడుగుతోందని ప్రచారం జరుగుతోంది. అప్పులపై కాగ్ బృందం ప్రత్యేకంగా ఆడిట్‌కు వచ్చినా ఏం తేల్చారో తెలియడం లేదు. నిజంగా ఏపీ అప్పుల గురించి లెక్కలు బయటకు తీయాలంటే.. గంట పని. గతంలోలా చేతిరాతతో ఏమీ ఉండటం లేదు.. అంతా రికార్డెడే. అయినా లెక్కలు తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదనపు అప్పులకు పర్మిషన్ ఇస్తున్నారు. ఏపీని ఆర్థికంగా దివాలా తీసేలా చేస్తున్నారు.