కేంద్ర ప్రభుత్వం దేశ క్రమినల్ చట్టాలన్నింటిని సమూలంగా మార్చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిదని.. ఇప్పుడు దాని అవసరం లేదని .. నిర్ణయానికి వచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లను రద్దు చేసి.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు.
కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘భారతీయ సాక్ష్య’ చట్టాలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాల ప్రకారం శిక్షల్ని కూడా మార్పు చేశారు. ఇప్పటి వరకూ జీవిత ఖైదు అంటే పధ్నాలుగు ఏళ్లు అనే లెక్కలు వేసేవాళ్లు. కానీ ఇక నుంచి జీవిత ఖైదు అంటే.. జీవించి ఉన్నంత వరకూ అని అర్థం. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలను కొత్త బిల్లుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చిన్నచిన్న నేరాలకు సంఘసేవను శిక్ష విధించబోతున్నారు. .
వేర్వేరు నేరాలకు సంబంధించిన జరిమానాలు, శిక్షలను పెంచారు. మైనర్లను అత్యాచారం చేస్తే ఉరిశిక్ష , సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు , మూక దాడులకు ఏడేళ్ల జైలు, 7 సంవత్సరాలకుపైగా శిక్ష విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాలు తప్పనిసరి అని ఈ చట్టాల్లో ఉంది. ఇక ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చునని.. సెర్చ్ ఆపరేషన్ చేస్తే సెర్చ్ వారెంట్తోపాటు ఎవరి వద్దకైనా వెళ్తే వీడియోగ్రఫీ చేయాల్సిందేనని చట్టాల్లో మార్చారు. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు అన్ని డిజిటైలైజ్ చేయాల్సి ఉంటుంది.
పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లులు అమల్లోకి వస్తాయి. అప్పటి వరకూ ప్రస్తుతం ఉన్న చట్టాలే అమలవుతాయి.