పోలవరం ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తుందని… దాన్నే జాతీయహోదా అని నాడు అన్నారు. కానీ ఇవాళ మట్టిపనులు ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినపనులకు జరిగినట్లుగా రీఎంబర్స్ చేయించుకోగలిగినా… ఈ రెండేళ్లలో కేంద్రం అసలు పోలవరానికి నిధులు ఇవ్వడానికే సిద్ధపడటం లేదు. తాజాగా.. అనేక బిల్లలును వెనక్కి పంపేసింది. వాటికి చెల్లించాల్సిన పని లేదని చెబుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. రెండు వేల కోట్లకుపైగా రీఎంబర్స్ చేయాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో రూ. మూడు వందల కోట్లకు ఆమోదం తెలిపి.. రూ. ఐదు వందల కోట్లు చెల్లించడానికి అర్హత లేనివని.. వెనక్కిపంపారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
కేంద్రం వాటిని వెనక్కి పంపడానికి కారణం… విద్యుత్ కేంద్రం బిల్లులని.. వాటితో .. ప్రధాన ప్రాజెక్టుకు సంబంధం లేదని కేంద్రం చెబుతోంది. అయితే అది విద్యుత్ కేంద్రం పనులు కాదని.. ప్రధాన ప్రాజెక్ట్ కోసం అవసరమైన మట్టిని అక్కడ్నుంచి సేకరించారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ.. కేంద్రం మాత్రం లైట్ తీసుకుంది. ఒక్క ఈ విషయంలోనే కాదు.. దాదాపుగా ప్రతి బిల్లులోనూ అదే పరిస్థితి. సవరించిన అంచనాలకు ఆమోదం లభించకపోవడంతో.. కేంద్ర ఆర్థిక శాఖ రూ. ఇరవై వైల కోట్లకే ఫిక్సయిపోయింది. ఆ ప్రకారమే.. నిధులు మంజూరు చేస్తోంది. ఆ ప్రకారం చూస్తే.. ఇక ఏపీకి రూ. పదిహేను వందల కోట్లు కూడా రావు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మిగిలిన ఏపీకి నికరంగా ఇచ్చింది ఒక్క పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే. మిగతావన్నీ హామీలే. ఇప్పుడు.. ఆ పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం గండికొడుతోంది. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏపీ సర్కార్‌కు కావాల్సినంత నిధుల లభ్యత ఉంది. సంక్షేమ పథకాల కోసం.. ఏడాదికి రూ. లక్ష కోట్లు.. ప్రజలకు బదిలీ చేస్తున్నామని చెబుతున్నారు. వాటిలో ముఫ్పై వేల కోట్లు ఖర్చు పెడితే పోలవరం పూర్తవుతుంది. రాష్ట్రం కరువు నుంచి బయటపడుతుంది. కానీ.. కేంద్రం ఇవ్వనిది.. తామెందుకు కట్టాలన్నట్లుగా ఏపీ సర్కార్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ జీవనాడిని నిర్వీర్యం చేస్తున్న ఏపీ సర్కార్ లో ఉలుకూ పలుకూ లేదు. కేంద్ర మోసంపై.. దండెత్తాల్సిన సమయంలో… సైలెంట్‌గా ఉంటున్నారు. అదే సమయంలో పనులు పరుగులు పెడుతున్నాయని చెప్పుకోవడానికి.. ప్రచారం చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి .. ప్రజల్ని ఘోరంగా మోసం చేయడమేనన్న విమర్శలు ఎదుర్కోవడానికి కారణం అవుతోంది.