ఆంధ్రప్రదేశ్లో మతం ఆధారంగా కరోనా సాయం పంపిణీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కొద్ది రోజుల కిందట.. ఏపీలో పాస్టర్లకు కరోనా పేరుతో రూ.5 వేలు ఇచ్చారు. ఈ విషయాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం
కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. నిజానికి ఈ పాస్టర్లందరూ మతం మారిన వారేనని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చెబుతోంది. ఏపీలో క్రిస్టియన్స్గా మతం మారి ఎస్సీ, ఓబీసీ వర్గాల ప్రతిఫలాలను పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా పోరాడుతోంది. కేంద్రానికి.. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల కారణంగా నకిలీ ఓబీసీ, ఎస్సీ సెర్టిఫికెట్లు పొంది విపత్తు ఉపశమన నిధి నుంచి..రూ.5 వేలు పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. అయితే అంతా ఏపీ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతున్నందున.. చర్యలు తీసుకోవడం దుర్లభమన్న చర్చ సహజంగానే వస్తోంది.
లాక్డౌన్ కారణంతో ఆదాయం కోల్పోయిన అర్చకులు, పాస్టర్లు, ముల్లాలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చారు. వీరిలో 33,803 మంది అర్చకులు ఉన్నారు. పాస్టర్లు 29,841 మంది ఉన్నారు. అప్పుడే విమర్శలు వచ్చాయి. రాష్ట్ర జనాభాలో 88 శాతానికి ఉన్న హిందువులు, దేవాలయాలకు ప్రాతినిధ్యం వహించే అర్చకుల సంఖ్యను 33,803గా నిర్ణయించిన జగన్ సర్కారు.. కేవలం 2.8 శాతం మాత్రమే ఉన్న క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహించే పాస్టర్ల సంఖ్యను, 29,841గా నిర్థారించింది. దీనిని బట్టి.. రాష్ట్రంలో మత మార్పిడులు ఎలా జరుగుతున్నాయో అర్థం అవుతోందని విశ్లేషణలొచ్చాయి.
పాస్టర్లు క్రైస్తవ మతస్తులే ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ మతం మార్చుకున్న వారూ పాస్టర్ల అవతారం ఎత్తి, ప్రభుత్వ నిధులు తీసుకుంటే ఎలా కుదురుతుందనే ప్రశ్న వస్తోంది. మతం మారితే ఎలాంటి సౌకర్యాలుంటాయో, ఉండవో చట్టం స్పష్టంగా చెబుతోంది. నిజానికి పాస్టరు కావాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. ఏపిటీసీ వంటి సంస్థలు పాస్టర్లకు శిక్షణ ఇస్తుంటుంది. శిక్షణ ముగిసిన తర్వాత సర్టిఫికెట్లు కూడా ఇస్తుంటాయి. గ్రామాల్లో ఒక గుడిసె, దానికి ముందు శిలువ..పట్టణాల్లో రెండు గదులు, పైన శిలువనే ప్రాతిపదికగా తీసుకున్నారే తప్ప.. వారు పాస్టర్లా కాదా అనే దాన్ని పట్టించుకోలేదు. ఇది మత మార్పిడులకు ప్రోత్సాహమేనని విమర్శలు ఉన్నాయి.