బీఆర్ఎస్ నేతల అవినీతిని క్రమంగా బయట పెడుతున్న కాంగ్రెస్ సర్కార్.. కేసులు, చర్యల విషయంలో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదికను లీక్ చేశారు. అధికారంగా బయటకు రానుంది. బడా నేతలపై కేసులు పెట్టాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్టేషన్లో నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పీఎస్‌గా వ్యవహరించిన కల్యాణ్‌పై కేసు నమోదైంది. ఈ కేసును అవినీతి నిరోధక శాఖ టేకప్ చేసి విచారణ చేస్తోంది.
ముందుగా కార్యాలయంలో ఫైళ్ల తరలింపుపైన నాంపల్లిలోనూ కేసు నమోదైంది. ఇందులో తలసాని పేరు వినిపిస్తోంది. ఫార్ములా ఈ- రేస్‌కు ఎలాంటి ఆదేశాలు లేకుండా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ రూ. 55 కోట్లు ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసిన అంశంపై ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దానిపై అరవింద్ కుమార్ పొంతన లేని సమాధానం ఇవ్వడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఆ రూ.55 కోట్ల తిరిగి చెల్లించాలని ప్రభుత్వం అరవింద్ కుమార్‌కు తేల్చి చెప్పింది. తాను కేటీఆర్ చెప్పినట్లే చేశానని ఆయన అంటున్నారు.
తాజాగా భూ కబ్జా కేసులో జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవికాకుండా లిస్టులో చాలా అంశాలే కనిపిస్తున్నాయి. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్‌పై విచారణకు ఆదేశించాలని ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయిస్తున్న విచారణలన్నీ బీఆరెస్ ప్రభుత్వ పెద్దల వైపే వేలెత్తి చూపిస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమైందని అంటున్నారు.
ఈ మేరకు ఒకరిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కక్ష సాధింపు రాజకయాలన్న పేరు రాకుండా ఎలా డీల్ చేయాలన్నదానిపై ఇప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ నేతలు పరిశీలన జరుపుతున్నారు. లోక్ సభ ఎన్నికల వరకూ కాస్త నెమ్మదిగా ఉంటే మంచిదని భావిస్తున్నారు.