కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎలా ఉంటారంటే వారి బలానికి ప్రాతిపదిక … ప్రజల్లో వారికి ఉన్న పట్టు కాదు. సీనియర్లు అనే ట్యాగ్. తాము సీనియర్లమని.. తాము చెప్పినట్లుగా నడవాలని వారు అనుకుంటూ ఉంటారు. లేకపోతే రచ్చ చేస్తూంటారు. ఇప్పుడు అలాంటి వారందరికీ కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే షాకిచ్చింది. టిక్కెట్ల విషయంలో ఈ సారి సీనియర్ నేతలెవరూ మాట్లాడటం లేదు. దీనికి కారణం హైకమాండ్ ఇచ్చిన షాకేనని చెబుతున్నారు.
మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా అనేక మంది సీనియర్లు తమ కుటుంబానికి రెండు టిక్కెట్లు కావాలని.. తమ అనుచరులుక టిక్కెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అయితే చాన్స్ లేదని.. బీఫామ్ మీక్కావాలో, మీ కుటుంబ సభ్యులకు కావాలో తేల్చుకోవాలని హైకమాండ్ తేల్చి చెప్పేసింది. చేరికల విషయంలోనూ ఎవరైనా అడ్డుకుంటే ఊరుకునేదిలేదన్న సంకేతాలను ముందుగానే పంపింది. నల్లగొండ జిల్లాలో ఇక ఎవర్నీ చేర్చుకోమని సొంత ప్రకటనలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టిషాక్ ఇచ్చింది. ఆయన వ్యతిరేకించినా వేముల వీరేశంను పార్టీలో చేర్చేసుకున్నారు. ఆయన కిక్కురుమనలేకుండా ఉన్నారు.
కొత్తగా చేరే వారిలో పొటెన్షియల్ లీడర్స్ ఉంటే వారి కోటాలో రెండు, మూడు టిక్కెట్లు కేటాయించడానికి రెడీనే. మైనంపల్లి మూడు సీట్ల బాధ్యత తీసుకున్నారు. గెలుస్తారని భావించిన వారందర్నీ చేర్చుకుటంున్నారు. బీఆర్ఎస్తో నేరుగా తలపడి గెలిచే అభ్యర్థులతోనే నాయకులే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల్లో రణరంగంలోకి దిగుతుందని మొహంమీదనే చెప్పేస్తున్నారు. టికెట్టు ఇచ్చిన తర్వాత కూడా అవసరమైతే బిఫామ్ మారే అవకాశం ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు. టార్గెట్ మిస్సవ్వకుండా కారును ఢీ కొట్టాలని చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సూటిగా, స్పష్టంగా ఉండటంతో సీనియర్ల పేరుతో రాజకీయం చేసే వారికి నోరెత్తే అవకాశం లేకుండా పోయింది.