హైదరాబాద్: తెలంగాణలోని సుమారు 8,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలంపాటల ద్వారా అమ్మి రు.3,000 కోట్లను రాబట్టాలని కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం కొత్త వివాదానికి తెరతీస్తోంది. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్కుమార్ రెడ్డి ఇదే విధంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముతున్నపుడు తెలంగాణ భూమిని అమ్మటానికి మీరెవరు అంటూ తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు అదే పని చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ భూములను ఆక్రమణదారులనుంచి కాపాడలేకపోతున్నామని, వాటిని ఉపయోగించుకోవటానికికూడా వీలవటంలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం సాకుగా చెప్పుకొస్తోంది. అయితే ఇది సరైన వాదన కాదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ గత ప్రభుత్వాలు హైదరాబాద్లో ప్రభుత్వ భూములను అమ్ముతున్నపుడు నిరసనగా కేటీఆర్, పద్మారావ్ గౌడ్ తదితరులు హెఎండీఏ ముందు ధర్నా నిర్వహించారని, టీఆర్ఎస్ ఇప్పుడు అదే పని ఎందుకు చేస్తోందని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని స్వార్థపూరిత శక్తుల ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఈ అమ్మకాలు ప్రారంభించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రు.17,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణను ఏర్పరిచి ఇచ్చిందని, కానీ కేసీఆర్ విధానాలవల్ల రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికొచ్చిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సంబరాలు, పుష్కరాలు వంటి కార్యక్రమాలపై కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. పద్మాలయా స్టూడియో, నాగార్జునలకు చెందిన భూముల వివాదాలపై టీఆర్ఎస్ మౌనంగా ఎందుకుందని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, ప్రభుత్వ భూముల అమ్మకంద్వారా లక్ష కోట్లు వస్తుందని కేసీఆర్ మొదట అన్నారని, తర్వాత ఆ మొత్తాన్ని రు.50 వేల కోట్లకు తగ్గించారని, ఆ తర్వాత పదివేల కోట్లకు తగ్గించారని, ఇప్పుడది రు.3,000 కోట్లకు దిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.