శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ తీర్మానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. మామూలుగా అయితే ఏపీ ప్రభుత్వం తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ బిల్లు రూపంలోకి మార్చి.. పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఉభయసభలు ఆమోదిస్తే శాసనమండలి రద్దవుతుంది. కొత్తగా పెట్టాలన్నా అదే ప్రక్రియ ఉంటుంది.
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారం చేపట్టిన మొదట్లో టీడీపీ ఎమ్మెల్సీలు అధికంగా ఉండేవారు. ఓ సారి రాజధాని బిల్లును వెనక్కి పంపడంతో… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. నిబంధనల ప్రకారం.. మూడొంతుల సభ్యుల మద్దతుతో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం ఇప్పటి వరకూ ఆ తీర్మానం జోలికి వెళ్లలేదు. కానీ ఆ తర్వాత ఖాళీ అయిన మండలి సభ్యులను సీఎం జగన్ ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడు వైసీపీకి మండలిలో మెజార్టీ ఉంది. దీంతో శాసనమండలి రద్దుపై వైసీపీ సైలెంట్ అయింది. మండలి రద్దు చేస్తూ.. అన్న మాటలన్నింటినీ మర్చిపోయారు. అయితే ఇప్పుడు టీడీపీ ఆ అంశాన్ని గుర్తు చేయడం ప్రారంభించింది. కేంద్రంతో వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉండటంతో .. వైసీపీ మళ్లీ అడిగితేనే శాసనమండలిని కేంద్రం రద్దు చేసే అవకాశం ఉంది. లేకపోతే.. అంతే కోల్డ్ స్టోరేజీలో ఉంచే అవకాశం ఉంది.