దేశవ్యాప్త లాక్ డౌన్ తప్పేలా లేదు. కొద్ది రోజుల కిందట జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. పరిస్థితిని లాక్ డౌన్ వరకూ తేవొద్దని… ప్రజలకు హెచ్చరికతో కూడిన స్వరంతోనే హెచ్చరించి వెళ్లారు. అయితే ఆ తర్వాత పరిస్థితి దిగజారింది. ఇప్పుడు.. పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి చేరింది. దీంతో.. కోవిడ్ పరిస్థితిని టాకిల్ చేసేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ .. ఇప్పుడు లాక్ డౌన్ పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని కేంద్రానికి నివేదిక పంపింది. పాజిటివిటీ రేటును బట్టి ఆరు నుంచి ఎనిమిది వారాల లాక్ డౌన్ అవసరం అని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు సరాసరి 21 శాతం ఉందని.. పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా ఉందని.. ఇప్పటికైనా కఠిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఐసీఎంఆర్ చెబుతోంది. తెలంగాణలో పాజిటివిటీ రేటు 9 శాతం.. ఆంధ్రాలో 23శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 10శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాలు లాక్డౌన్ విధించాలని జాతీయ టాస్క్ఫోర్స్ స్పష్టం చేసింది. నిజానికి.. కేంద్రం ప్రకటించకపోయినా దాదాపుగా అన్ని రాష్ట్రాలు .. కర్ఫ్యూలో.. లాక్ డౌన్లో ప్రకటించి అమలు చేస్తున్నాయి.
ఈ తరుణంలో కేంద్రం సొంతంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటిస్తుందా.. టాస్క్ ఫోర్స్ నివేదికను అమలు చేస్తుందా.. అన్నది సందేహమే. ఎందుకంటే.. లాక్ డౌన్ రాష్ట్రాల ఇష్టమని మోదీ పదే పదే చెబుతున్నారు. కేంద్రం లాక్ డౌన్ విధిస్తే.. ఆర్థిక కష్టనష్టాలను ఎంతో కొంత తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. అది.. కేంద్రానికి ఇష్టం లేదు. అందుకే రాష్ట్రాలకు వదిలేసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడైనా కేంద్రం బాధ్యత తీసుకుంటుందా లేదా అన్నది … కేంద్రం తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది.