టీఆర్ఎస్ కంచుకోట దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుపు క్రెడిట్ పూర్తిగా టీఆర్ఎస్దే. మీతి మీరిన ఆత్మవిశ్వాసం… లాజిక్ లేని వ్యూహంతో టీఆర్ఎస్ దారుణంగా దెబ్బతిన్నది. బీజేపీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. దుబ్బాక అసెంబ్లీకి ఉపఎన్నిక వచ్చినప్పుడు అక్కడ పార్టీల స్థితిగతుల్ని అంచనా వేసిన తర్వాత టీఆర్ఎస్కు తిరుగులేదని అందరూ నిర్ణయించుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తప్పులు చేసింది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో …ఓట్ల చీలిక వ్యూహం పాటించింది. ఆ ప్రకారం.. బీజేపీ అభ్యర్థికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఎంతగా అంటే.. రఘునందన్ పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టి… ఆయన ఏం చేసినా తెలుసుకుని.. ఎన్నికల వ్యూహాలను చెల్లాచెదురు చేసేంతగా వ్యూహం పన్నారు.
ఎన్నిక మొదట్లోనే.. హైదరాబాద్ శివార్లలో డబ్బులు పట్టుకున్నారు. అవి పంచడానికే తీసుకెళ్తున్నారని పోలీసులతో స్టేట్మెంట్ ఇప్పించారు. అప్పటి నుంచి టార్గెట్ రఘునందన్ నడిచింది. మూడు సార్లు డబ్బులు పట్టుబడ్డాయి. అయితే.. ఇవన్నీ.. రఘునందన్ పై ప్రజల్లో సానుభూతిని పెంచాయి. రఘునందన్‌నే ప్రధాన ప్రత్యర్థి అనే పరిస్థితిని టీఆర్ఎస్ తీసుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయక ఓట్లు.. చెరుకు కుటుంబంపై ఉన్న అభిమానం.. ఇప్పుడు.. బీజేపీ ని ప్రత్యర్థిగా రూపొందించడం వల్ల… ఓట్లు మొత్తం మూడు పార్టీల మధ్య చీలిపోతాయని.. తమకు భారీ మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ వ్యూహకర్తలు అంచనా వేశారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇదే అనుకున్నారు. కానీ.. బీజేపీని ఎలా టార్గెట్ చేద్దామనుకున్నారో.. దాన్నే ఆ పార్టీ ప్లస్ పాయింట్‌గా మార్చుకుంది. గెలుపు దిశగా దూసుకెళ్లింది.
అధికార పార్టీ ఉపఎన్నికల్లో ఓడిపోవడం అంటే ఆషామాషీ కాదు. ఎందుకంటే.. ప్రభుత్వ పథకాల లబ్దిదారులు తమ ఓటును అధికార పార్టీకే వేస్తారు. ఓ వేళ వేయకపోతే.. తమకు అందే పథకాలు ఆగిపోతాయేమోనని వారు ఆందోళన చెందుతారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్దిదారులను టార్గెట్ చేసి పక్కాగా ప్రచారం చేసింది. అరవై వేల మందికిపైగా ఉన్న సామాజిక పెన్షన్లు పొందేవారు.. రైతు భరోసా పొందుతున్న వారితో పాటు.. ప్రత్యేకంగా జీవో ఇచ్చి మరీ ఎన్నికలకు ముందే.. బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేశారు. అందుకే ఎలా చూసినా.. లక్ష ఓట్లు తమకు వస్తాయని టీఆర్ఎస్ నేతలు అంచనా వేసుకున్నారు. కానీ కేంద్రంలో అధికార పార్టీగా తమకు ఉన్న అడ్వాంటేజ్‌ను బీజేపీ ఇంకా పక్కాగ ఉపయోగించుకుంది.
టీఆర్ఎస్ ఇస్తున్న పథకాలు మొత్తం.. కేంద్ర నిధులతో ఇస్తున్నవేనని ఉద్ధృతంగా ప్రచారం చేశారు. ఇది ఎంతగా సాగిందంటే… చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించాల్సి వచ్చింది. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో వారి నిధులు ఉన్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఇది మరింత చర్చకు కారణం అయింది. చివరికి అది బీజేపీకి ప్లస్ అయింది. మొత్తంగా చూస్తే.. బీజేపీ ఎదుగుదలకు.. గెలవడానికి.. టీఆర్ఎస్నే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.