ఏపీ ప్రభుత్వం ఎక్కడ దొరికితే అక్కడ…. ఎంత వడ్డీ రేటు అన్నది చూడకుండా అప్పులు చేస్తోంది. ఈ అప్పుల కారణంగా రోజుకు కట్టాల్సిన వడ్డీలే రూ 63 కోట్లుగా లెక్క తేలింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.17,507 కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంటే ఒక్క వడ్డీలకే రోజుకు రూ.63 కోట్లు చెల్లిస్తున్నట్లు తేలింది. గతేడాదికన్నా ఈ ఏడాది రూ.2,300 కోట్ల వరకు వడ్డీకి అదనంగా ఖర్చు జరిగింది. అయితే ఇందులో వడ్డీలు మాత్రమే కాదని.. కొంత అసలు కూడా ఉంటుందని.. ఈఎంఐల్లా వీటిని కడతారు కాబట్టి ఇందులో అసలు… వడ్డీ కలిసి ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏదైనా తిరిగి చెల్లింపుల కోసం రోజుకు రూ. 63 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని అప్పులకు వడ్డీలు.. జమ కానున్నాయి.
మొత్తం ఏడాదికి రూ.48,724 కోట్లుగా బడ్జెట్లో ప్రతిపాదించగా, తొమ్మిది నెలల్లోనే రూ.55,555 కోట్లకు రుణాలు చేరిపోయాయి. అంటే లక్ష్యం కన్నా అప్పుడే 114 శాతం అధికంగా రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఈ రుణాలు నెలకు సగటున రూ.6,173 కోట్లుగా ఉండగా, రోజుకు రూ.202 కోట్లుగా లెక్కలు తేలాయి. ఈ రోజువారీ మొత్తం రుణం రోజువారీ సొంత ఆదాయానికి దరిదాపుల్లో ఉన్నాయి. అంటే.. ఎంత ఆదాయం వస్తుందో అంత అప్పు చేస్తున్నారు.
కాగ్ వెల్లడించిన లెక్కల మేరకు ఆదాయ వ్యయాలు సమానంగా కనిపిస్తుండగా, రుణాలు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీల భారం అధికంగా కనిపిస్తోంది. అలాగే వ్యయ విభాగంలో రెవెన్యూ వ్యయం కన్నా పెట్టుబడి వ్యయం నామమాత్రంగానే ఉన్నట్లు తేలింది. అప్పు ప్రభుత్వం తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీ ఖజానాకు పెనుభారంగా మారుతోంది.. అప్పులు తీర్చడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.