గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిపై కన్నేసిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డిగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశాన్ని ఆస్పత్రి అమ్మకానికి వ్యతిరేకంగా ఉన్న డైరక్టర్లు నేరుగా మీడియా సమావేశంలోనే ప్రకటించారు. మేఘా సంస్థ కృష్ణారెడ్డి .. ఎన్ఆర్ఐ సంస్థను కొనుగోలు చేస్తామని వచ్చారని.. కొంత మందితో సంప్రదింపులు జరిపి.. కొంత బెదిరింపు ధోరణితో మాట్లాడారని డైరక్టర్లు ప్రటించారు. తాము ఆస్పత్రి అమ్మకానికి సిద్ధంగా లేమని.. కొంత మందిని లోబర్చుకుని.. తప్పుడు కేసుల ద్వారా ఆస్పత్రిలో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కల్పించి.. స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని .. డైరక్టర్లుఆరోపిస్తున్నారు.
ఎన్నారై డైరక్టర్ల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో .. మూడు నెలల క్రితం బుచ్చయ్య అనే డైరక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హఠాత్తుగా రాత్రికి రాత్రి ఆస్పత్రికి చెందిన నలుగురు కీలక వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రి అమ్మకానికి వ్యతిరేకంగా బోర్డు తీర్మానం చేయబోతోందని తెలిసి.. బోర్డు సమావేశం జరగకుండా చేసేందుకు ఇలా చేస్తున్నారని వారంటున్నారు. ఆస్పత్రిపై అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారని.. వేటిపైనా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇదే అంశంపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తంగా ఈ వివాదంలో లింగమనేని గ్రూప్ పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది.
గతంలో లింగమనేని గ్రూప్‌నకు చెందిన వారు కొంత మంది డైరక్టర్ల బోర్డులోకి చొరబడ్డారని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేలా లేదు. మొత్తం డైరక్టర్లలో మెజార్టీ వర్గం ఆస్పత్రి అమ్మకానికి వ్యతిరేకం అయినప్పటికీ.. మరో వర్గంలో కూడా.. ఎక్కువ మందే ఉన్నారు. వారంతా అమ్మకానికి అనుకూలంగా ఉన్నారు. అంత కంటే ముఖ్యంగా ప్రభుత్వం .. మేఘా కృష్ణారెడ్డికి అనుకూలంగా ఉంటుందనడంలో సందేహం ఉండదు. అందుకే.. ఎన్నారై ఆస్పత్రి మేఘా పరం కాకుండా కాపాడుకోవడం.. ప్రస్తుతం కమిటీకి సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.