తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా చేయడంలో ప్లాన్డ్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా తనను క్రికెట్ మ్యాచ్‌కు పిలువలేదని… దండో సభలో మాట్లాడటానికి చాన్సివ్వలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరవడం కూడా కామెడీ కోటాలోనే వెళ్లిపోయింది.
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన శాసనసభ ప్రాంగణంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆవేశంతో ఊగిపోయారు. పీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడానికి ముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానన్నారు. జహీరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ పెట్టి తనను పిలవలేదని… గజ్వేల్ సభలో మాట్లాడేందుకు చాన్సివ్వలేదన్నారు. తాను కూడా పార్టీకి సంబంధం లేకుండా రెండు లక్షల మందితో సభ పెడతానని చాలెంజ్ చేశారు. అయితే జగ్గారెడ్డి మాటలు టీ కాంగ్రెస్‌లో గతంలోలా కలకలం రేపలేదు. సీనియర్ల ప్రయత్నం అని లైట్ తీసుకున్నారు.
టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత చురుగ్గా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే రేవంత్ దూకుడు పార్టీ సీనియర్లకు నచ్చడం లేదు. తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండటం లేదని.. తమకు స్థాయికి తగ్గ గౌరవం దక్కడం లేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇక పార్టీని ఇబ్బంది పెట్టే ప్రకటనలు కూడా తరచూ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తరచూ చర్చకు వస్తున్నాయి. అయితే ఇటీవల ఏఐసిసి తెలంగాణకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ నియమించింది. ఆ కమిటీనే అన్నీ చేస్తోంది. ఇప్పుడు రేవంత్‌ను టార్గెట్ చేసినా క్యాడర్ పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయింది. సీనియర్లకు ఇది కాస్త గడ్డు పరిస్థితే.