ఎన్నికల సంఘం తాజాగా జాతీయ, ప్రాంతీయ పార్టీల వివరాలను ప్రకటించింది. జాతీయ పార్టీలుగా జాతీయ కార్యదర్శలను.. జాతీయ అధ్యక్షులను ప్రకటించుకున్న టీడీపీ, వైఎస్ఆర్ సీపీకి ప్రాంతీయ పార్టీలుగానే గుర్తింపు ఇచ్చింది. టీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. అయితే జనసేన పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా కూడా రాలేదు. గుర్తింపు లేని పార్టీల జాబితాలోనే జనసేన పార్టీ కూడా చేరిపోయింది. దీంతో ఇప్పటి వరకూ ఆ పార్టీకి కామన్‌గా కేటాయిస్తున్న గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ కేటగరిలో చేర్చింది.
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం తెచ్చుకోవాలి. అలాగే రెండు అసెంబ్లీ సీట్లను గెలవాలి. అయితే జనసేనకు ఆరు శాతం ఓట్లు కంటే ఎక్కువే వచ్చాయి కానీ ఒకటే అసెంబ్లీ స్థానం వచ్చింది. కనీసం ఒక లోక్‌సభ స్థానం గెలిచినట్లయినా గుర్తింపు దక్కి ఉండేది. ఏ సీట్లు సాధించకపోయినా ఎనిమది శాతం ఓట్లు వచ్చినా ఈసీ గుర్తింపు వచ్చి ఉండేది.
అయితే జనసేన గుర్తుకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు కామన్‌గా తమకు గ్లాస్ గుర్తే కేటాయించాలని ఈసికి దరఖాస్తు చేసుకుంటే కేటాయించే అవకాశం ఉంది. ఇతరులకు కేటాయించే అవకాశం ఉండదు. అయితే ఇటీవల జనసేన పార్టీ తిరుపతిలో పోటీ చేయకపోవడం వల్ల గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయించారు. వారు ప్రత్యేకంగా గ్లాస్ గుర్తు కోసమే విజ్ఞప్తి చేశారు. జనసేన పోటీ చేసి ఉంటే ఆ పార్టీకే కేటాయించేవారు. అలాగే వచ్చే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది.