తమిళ నాట కొత్త వివాదాన్ని రాజేస్తున్న వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీమెన్ 2`. త్వరలోనే అమేజాన్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌పై తమిళ సంఘాలు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నాయి. తమిళ ప్రజల పోరాటాన్నీ, చరిత్రనీ కించపరిచేలా ఉందని, ఈ వెబ్ సిరీస్ ని అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ వెబ్ సిరీస్ ని నిషేధించే దిశగా తమిళ నాడు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న వార్తలూ వచ్చాయి. దాంతో ఎట్టకేలకు ఈ వివాదంపై `ది ఫ్యామిలీమెన్ 2` బృందం స్పందించింది.
తమకు తమిళ ప్రజలు, వాళ్ల మనోభావాలపై చాలా గౌరవం ఉందని, వాటికి కించపరిచేలా ఈ వెబ్ సిరీస్ ఏమాత్రం ఉండదని స్పష్టం చేసింది. తమ టీమ్ లో తమిళులు చాలామంది ఉన్నారని, వాళ్లకి తమిళ చరిత్రపై అవగాహన గౌరవం ఉన్నాయని, ఇది తమ ఎన్నో ఏళ్ల కల అని, ఈ వెబ్ సిరీస్ చూశాకే.. సరైన అభిప్రాయానికి రావాలని, ట్రైలర్లో రెండు మూడు షాట్లు చూసి ఓ అంగీకారానికి రావొద్దని దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. వీటితో తమిళ సంఘాలు సంతృప్తి పడతాయా? లేదా? అనేది చూడాలి.