ఓ వ్యక్తి ఏం సంపాదించాడన్నది బతికున్నప్పటి కంటే చనిపోయినప్పుడే బాగా తెలుస్తోంది. ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ రాల్చిన కన్నీళ్లే అసలైన ఆస్తి. ఆ విషయంలో.. బిఏ రాజు.. నిజంగానే రారాజు. నిన్నరాత్రి గుండెపోటుతో బిఏ రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ – టాలీవుడ్ శోక సంద్రంలోనే ఉంది. మహేష్ బాబు నుంచి నిన్నా మొన్న హీరోగా అడుగుపెట్టిన వాళ్ల వరకూ.. అందరూ `అరె.. ఇలా జరిగిందేంటి` అని వాపోయారు. ట్వీట్లతో తమ సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్నీ తెలియజేశారు.
రాజు గురించి మాట్లాడని హీరో లేడు. రాజు గురించి ట్వీట్ చేయని హీరోయిన్ లేదు. దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లూ.. అందరినోటా బిఏ రాజు మాటే. రిప్ బిఏ రాజు అనేది ఈరోజుకి ట్రెండింగ్. ఓ పాత్రికేయుడికి, సినిమానే నమ్ముకున్న వ్యక్తికి, దశాబ్దాలుగా సినిమానే నమ్ముకుని బతికిన ప్రేమికుడికి ఇంతకంటే ఘన నివాళి ఏముంటుంది? కరోనా నిబంధనల దృష్య్టా కడసారి చూసేందుకు వీలు చిక్కలేదు. లేదంటే… కన్నీటితో వీడ్కోలు పలకడానికి టాలీవుడ్ మొత్తం.. బిఏ రాజు ఇంటి ముందు క్యూ కట్టేది.
ఈమధ్య సినీరంగం చాలామందిని కోల్పోయింది. వాళ్లలో నటులు ఉన్నారు. దర్శకులు ఉన్నారు. టెక్నీషియన్లు ఉన్నారు. వారెవరికీ రాని సంతాపాలు రాజుకి దక్కాయి. అవన్నీ మనస్ఫూర్తిగా రాల్చిన కన్నీటి బొట్లే. పాత్రికేయలోకమైతే ఇంకా షాక్ లోనే ఉంది. తమతో కలిసి ప్రయాణంచి, తమ ఎదుగుదలలో భాగమైన రాజు మరణం.. ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.