ఆంధ్రప్రదేశ్‌లో రిటైర్డ్ ఉద్యోగుల్లో అత్యధికులకు ఇంకా పెన్షన్లు అందలేదు. సాధారణంగా జీతాలతో పాటే వారికి పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లలో పడిపోతాయి. కానీ వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత జీతాలకే కటకట అయిపోయింది. పెన్షన్లను ఎప్పుడు ఇచ్చినా ఇబ్బంది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. దాంతో ప్రతీ నెలా ఆలస్యం అవుతోంది. ఈ నెల పదకొండో తేదీ వచ్చినా ఇప్పటి వరకూ 90 శాతం మందికి పైగా పెన్షన్లు క్రెడిట్ కాలేదు. దాంతో పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై మాట్లాడటానికి వెనుకాడుతున్నారు. కానీ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాత్రం ధైర్యం చేశారు.
ప్రతి నెల 1వ తేదిన రావాల్సిన పెన్షన్లు ఇంకా రాలేదని ఆయన నేరుగా సీఎస్ దగ్గరకు వెళ్లిపోయారు. పెన్షన్లు చెల్లించాకే మా జీతాలు చెల్లించాలని ఇప్పటికే కోరామని … ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు వచ్చేలా సీఎస్ చర్యలు తీసుకోవాలని ఆయన సీఎస్‌ను కోరారు. దీనిపై సీఎస్ స్పందనేమిటో క్లారిటీ లేదు. అయితే… ఆర్థిక ఇబ్బందుల కారణంగానే పించన్లను ఇంత వరకూ చెల్లించలేదు. ఖజానాలో డబ్బులు ఉంటే చెల్లించడానికి గంట సమయం కూడా పట్టదు. ఆర్థిక సంవత్సరం చివరికి రావడం.. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు తీసుకోవడంతో… ఈ రెండు నెలలు.. అప్పులు లేకుండా వచ్చే ఆదాయంతోనే సరి పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ ఆదాయం ఇప్పుడు.. జీతాలకు కూడా సరిపోని పరిస్థితి. సహజంగా పెన్షనర్లకే… ఎక్కువ అవసరాలు ఉంటాయి. కానీ ప్రభుత్వం పెన్షన్లను ఆలస్యం చేస్తూండటంతో వారిలోనూ అసంతప్తి పెరిగిపోతోంది. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటి వరకూ నోరెత్తలేకపోయారు. బొప్పరాజు మాత్రం ధైర్యం చేసి సీఎస్‌ను కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు.