ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలేవీ ప్రజలకు తెలియచేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు అసాధారణ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జీవోలు ఏవీ పబ్లిక్ డొమైన్లో పెట్టవద్దని సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ముత్యాలరాజు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇక జీవోలన్నీ ఆఫ్‌లైన్‌లో అధికారులమధ్య మాత్రమే ఉంంటాయి. ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. కాన్ఫిడెన్షియల్ జీవోలు.. బ్లాంక్ జీవోలను అదే పనిగా విడుదల చేస్తోంది.
ఈ కారణంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బ్లాంక్ జీవోలతో రహస్య పాలన చేస్తున్నారంటూ కొంత టీడీపీ గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఈ బాధంతా ఎందుకు అనుకున్నారేమో కానీ అసలు జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఆపేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పారదర్శకమైన పాలన చేయాలన్న ఉద్దేశంతో 2008 నుంచి పబ్లిక్ డొమైన్లో జీవోలను ఉంచుతున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇలా జీవోలను రహస్యంగా ఉంచేయాలని అనుకోలేదు. అయితే వివాదాస్పదమవుతాయనుకున్న జీవోలను కాన్ఫిడెన్షియల్ పద్దతిలో ఉంచేవారు.
నిర్ణయాలను అమలు చేసిన తర్వాత బహిరంగపరిచేవారు. జీవోలను పబ్లిక్ డొమైన్లో ఉంచడం వల్ల ప్రభుత్వం ఎవరెవరికి ఎంత చెల్లిస్తోంది అనేది బయటకు తెలుస్తోంది. లాయర్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తున్న జీవోలు.. అసాధారణ చెల్లింపులు.. నియామాకాలు ఇలా అన్నీ చర్చనీయాంశం అవుతూండటంతో ప్రభుత్వం అసలు .. జీవోలన్నీ సీక్రెట్‌గానే ఉంచాలని నిర్ణయం తీసుకుంది. పారదర్శకమైన పాలన అందిస్తామని ప్రమాణస్వీకార వేదికపై నుంచి ఘనంగా ప్రకటించినజగన్మోహన్ రెడ్డి అసలు ప్రభుత్వ పాలన అంతా రహస్యంగా జరగాలని నిర్ణయం తీసుకోవడం… మరిన్ని విమర్శలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.